జాతీయ అవార్డ్ విజేత‌ను త‌క్కువ‌గా చూసారా?

సోష‌ల్ మీడియాల్లో 1-2శాతం మంది మాత్ర‌మే మ‌నల్ని వ్య‌తిరేకించేవాళ్లు ఉంటార‌ని వారిని అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా అన్నారు.;

Update: 2026-01-11 02:30 GMT

జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌.. ఇది విన‌డానికి గ్రాండ్ గా ఉన్నా కానీ, సాధించ‌డానికి ఎంత‌గా శ్ర‌మించాలో..? ఇలాంటి అవార్డు తీసుకున్న ప్ర‌తి క‌ళాకారుడు తాము ఎంత‌గా శ్ర‌మించాల్సి వ‌చ్చిందో వేదిక‌ల‌పై ఎమోష‌న‌ల్ అవ్వ‌డం చూసిన‌దే. ప్ర‌తి అవార్డ్ త‌మ‌లో కొత్త ఉత్సాహం నింపుతుంద‌ని క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వాలు పుర‌స్కారాలు ఇచ్చి ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటారు. అలాంటిది ఒక జాతీయ అవార్డ్ వ‌చ్చిన‌ప్పుడు ఆ ప్ర‌ముఖుడి ఎమోష‌న్ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం.

ఇప్పుడు `మ‌న శంక‌రవ‌రప్ర‌సాద్ గారు` రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న అనీల్ రావిపూడి `భ‌గ‌వంత్ కేస‌రి`కి జాతీయ అవార్డు ప్ర‌కటించిన స‌మ‌యంలో నెటిజ‌నుల్లో ఒక వ‌ర్గం ఎలా స్పందించారో మాట్లాడారు. కొంద‌రు దీనిని అంత ప్ర‌శంసాపూర్వ‌కంగా తీసుకోలేద‌ని, అప్రీషియేష‌న్ చేయ‌డానికి కూడా ముందుకు రాలేదని అన్నారు. కానీ రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా జాతీయ అవార్డ్ అందుకున్న అరుదైన క్ష‌ణాన్ని తాను ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని అన్నారు. సామాజిక మాధ్య‌మాల‌లో కొంద‌రి వ్య‌తిరేక‌త‌ను అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా అన్నారు.

సోష‌ల్ మీడియాల్లో 1-2శాతం మంది మాత్ర‌మే మ‌నల్ని వ్య‌తిరేకించేవాళ్లు ఉంటార‌ని వారిని అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా అన్నారు. వారిని ఏదో ఒక‌టి అన‌డం ద్వారా దాని విలువ పెంచ‌డం ఇష్టం లేద‌ని అన్నారు. మెజారిటీ వ‌ర్గాలకు నా సినిమాలు న‌చ్చాయి. కొంద‌రు టార్గెటెడ్ గా విమ‌ర్శిస్తున్నార‌ని మ‌న‌కు తెలిసిన‌ప్పుడు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా అనీల్ రావిపూడి అన్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి చిత్రానికి జాతీయ అవార్డ్

నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి తెర‌కెక్కంచిన `భగవంత్ కేసరి` (2023) చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో `ఉత్తమ తెలుగు చిత్రం` అవార్డును దక్కించుకుంది. ఇది కేవ‌లం మాస్ యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే కాదు, ఇందులో బలమైన సామాజిక సందేశం జూరీని మెప్పించింది. నారి శక్తి (ఆడపిల్లల)ని కేవలం సుకుమారంగా కాకుండా `సింహం`లా ధైర్యంగా పెంచాలనే సందేశం హీరో అయిన నేలకొండ భగవంత్ కేసరి పాత్ర ద్వారా ఇవ్వ‌డం జ్యూరీ సభ్యులను మెప్పించింది. ఈ సినిమాలో చిచ్చా (బాలయ్య) - పాప (శ్రీలీల) మధ్య ఉండే బాండింగ్, ఒక అమ్మాయి తన భయాన్ని పోగొట్టుకుని ఎలా పోరాటం సాగించాల‌నే కథాంశం అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పుడు చిరంజీవి `మన శంకరవరప్రసాద్ గారు` సినిమా ప్రమోషన్లలో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడికి భ‌గ‌వంత్ కేస‌రిపైనా కొన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఒక సంద‌ర్భంలో అనిల్ రావిపూడిని అభినందిస్తూ, ``సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు తీసిన‌ప్పుడు ఇలాంటి గౌర‌వం ద‌క్కుతుంద‌``ని అన్నారు. రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా చిత్ర‌నిర్మాత సాహు గార‌పాటి, అనీల్ రావిపూడి ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో అవార్డుల‌పై కొంద‌రికి వ్య‌తిరేక‌త ఉంది. దానిని సోష‌ల్ మీడియాల్లో బ‌య‌ట‌పెట్టే వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. భ‌గ‌వంత్ కేస‌రికి జాతీయ ఉత్త‌మ చిత్రం (తెలుగు)గా అవార్డ్ ద‌క్కిన‌ప్పుడు ఇలాంటి కామెంట్లు చేస్తూ కొంద‌రు దుర‌భిమానులు చేసిన వ్యాఖ్య‌లు చిత్ర‌బృందాన్ని హ‌ర్ట్ చేసాయి.

Tags:    

Similar News