బెత్లెహెం కుటుంబ యూనిట్ ట్రైలర్.. ఎలా ఉందంటే..

మలయాళంలో ఓనం సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్స్ అందుకున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగులోకి వస్తోంది.

Update: 2026-08-30 04:32 GMT

మలయాళంలో ఓనం సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్స్ అందుకున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. ‘ప్రేమలు’ తర్వాత దర్శకుడు గిరీష్ ఏ.డీ, మమితా బైజు కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నివిన్ పౌలీ హీరో. సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ ద్వారా సినిమా విడుదల కానుంది. ఇక లేటెస్ట్ గా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మలయాళంలో ఇప్పటికే సినిమా థియేటర్లలో ఉండటంతో, తెలుగు ట్రైలర్‌లో కథను పెద్దగా దాచలేదు. అందులోని పాత్రలు, కామెడీ, ప్రేమకథ మూడ్‌ను ఎక్కువగా చూపించారు.




 


ట్రైలర్ మొదట్లోనే జస్టిన్ పాత్రను చిన్న ఫన్నీ టచ్‌తో పరిచయం చేశారు. పాత పాటలను ఎమ్‌పీ3 ఫార్మాట్‌లోకి మార్చి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే కుర్రాడిగా నివిన్ కనిపిస్తాడు. మరోవైపు విదేశాల నుంచి ఊరికి తిరిగి వచ్చిన ఆష్లీగా మమితా ఎంట్రీ ఇస్తుంది. వీరిద్దరికీ ముందే పరిచయం ఉందని ట్రైలర్‌లోనే తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఎదురుపడిన ఈ ఇద్దరి మధ్య మాటలు కూడా మొదటి నుంచే సరదాగా సాగుతాయి.

ఆ పరిచయం మళ్లీ దగ్గరయ్యే దిశగా కథ కదులుతున్నట్లు కనిపిస్తోంది. జస్టిన్, ఆష్లీ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ను కూడా కామెడీకి వాడుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో వచ్చే చిన్న గొడవలు, పక్కింటి వాళ్ల జోక్యం, కుటుంబ సభ్యుల రియాక్షన్స్‌తో కథను లైట్‌గా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు ఫ్యామిలీ కామెడీకి కూడా మంచి స్పేస్ ఉన్నట్లు కనిపిస్తోంది. మధ్యలో వచ్చే పెళ్లి వాతావరణం కథలో చాలామందిని ఒకేచోటికి తీసుకొచ్చే పాయింట్‌గా ఉంది.

మమితా పాత్రలో చలాకీతనం ఎక్కువగా కనిపిస్తే, నివిన్ పాత్రను కాస్త అమాయకంగా, సైలెంట్ కామెడీ చేసే వ్యక్తిగా చూపించారు. ఇద్దరి మధ్య సీన్స్‌లో ఎక్కువగా సరదా టోన్‌నే ఉంచారు. ట్రైలర్ మొత్తం పెద్ద డ్రామా లేదా హెవీ ఎమోషన్ వైపు వెళ్లకుండా, చిన్న చిన్న మూమెంట్స్ తోనే నవ్వించే ప్రయత్నం కనిపిస్తోంది. మమితా ఎక్స్‌ప్రెషన్స్, నివిన్ టైమింగ్ మీదే చాలా సీన్స్ నడిచేలా ఉన్నాయి.

టెక్నికల్‌గా కూడా ట్రైలర్‌కు ఒక ఫీల్ ఉంది. విష్ణు విజయ్ సంగీతం కథకు సరిపోయేలా ఉంది. పెళ్లి ఇల్లు, పక్కింటి సందడి, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథ ఏ ప్రపంచంలో నడుస్తుందో ముందే చెప్పేస్తున్నాయి. ‘ప్రేమలు’లో యూత్ కామెడీని పట్టుకున్న గిరీష్, ఈసారి అదే సరదాను ఫ్యామిలీ సెటప్‌లోకి తీసుకొచ్చినట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది.

మలయాళంలో సినిమా ఇప్పటికే మంచి వసూళ్లతోను అందుకుంది. ట్రాకింగ్ లెక్కల ప్రకారం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.124 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ‘ప్రేమలు’తో వచ్చిన క్రేజ్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.



Full View


Tags:    

Similar News