మల్లూ స్టార్‌కు కోలీవుడ్ బ్రేక్ ఇవ్వనుందా?
ఏదేమైనా రజినీకాంత్ 173వ సినిమా బాసిల్ జోసెఫ్‌కు కేవలం మరో ప్రాజెక్ట్ మాత్రమే కాదు. యాక్టర్ గా తన పరిధిని విస్తరించుకునే మరో గొప్ప అవకాశమని చెప్పొచ్చు;
మలయాళ సినీ పరిశ్రమ నుంచి సైలెంట్‌గా వచ్చి, తన సబ్టిల్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు-డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు కోలీవుడ్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్ బాసిల్ కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్‌గానూ..
బాసిల్ జోసెఫ్ పేరు మొదట దర్శకుడిగా వినిపించింది. వినూత్న కథలతో, హాస్యానికి ఎమోషన్స్ ను జోడించే తన శైలితో మలయాళంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. తర్వాత డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గానూ తనలో ఉన్న టాలెంట్ ను ఆయన ప్రూవ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున హావభావాలు ప్రదర్శించకుండా, సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయే ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సహజత్వం ఆయన బలమైతే, స్క్రీన్‌పై కనిపించే నిశ్శబ్ద భావవ్యక్తీకరణ ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
పరాశక్తి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ
రీసెంట్ గా శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పరాశక్తి సినిమాలో గుర్తుండిపోయే క్యామియో ద్వారా తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఆ చిన్న క్యామియోనే ఇప్పుడు కోలీవుడ్ వర్గాల దృష్టిని ఆయనవైపు తిప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రజినీకాంత్ సరసన కీలక పాత్ర పోషించే అవకాశం దక్కడం, ఆయన నటుడిగా ఎదుగుతున్న ప్రస్థానానికి పెద్ద గుర్తింపనే అనుకోవాలి. రజినీకాంత్ సినిమాల్లో సాధారణంగా పాత్రలకు చాలా స్ట్రాంగ్ ఆర్క్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో సాగే కథల్లో భావోద్వేగాల బరువు ఎక్కువగా ఉంటుంది. అలాంటి కథలో బాసిల్ జోసెఫ్‌కు ప్రాధాన్యత గల పాత్ర దక్కితే, తన సబ్టిల్ పెర్ఫార్మెన్స్‌తో ఆ భావోద్వేగాలను మరింత గాఢంగా చూపించే సామర్థ్యం ఆయనకు ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న స్టార్‌తో పాటు నేచురల్ యాక్టింగ్ కు ప్రాధాన్యత ఇచ్చే నటుడు కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు.
ఒక భాష నుంచి మరో భాషలోకి వచ్చి సినిమాలు చేయడం కొత్త విషయం కాకపోయినా, ప్రతి నటుడికి ఆ మార్పనేది అనుకున్నంత సులభంగా ఉండదు. భాష, ప్రేక్షకుల అభిరుచి, కథన శైలి.. ఇవన్నీ భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ బాసిల్ ఇప్పటివరకు ఎంచుకున్న పాత్రల్ని గమనిస్తే, కథకు అవసరమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తారన్న విషయం స్పష్టమవుతుంది. అదే ధోరణిని కొనసాగిస్తే, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించగలడనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా రజినీకాంత్ 173వ సినిమా బాసిల్ జోసెఫ్‌కు కేవలం మరో ప్రాజెక్ట్ మాత్రమే కాదు. యాక్టర్ గా తన పరిధిని విస్తరించుకునే మరో గొప్ప అవకాశమని చెప్పొచ్చు. ఆల్రెడీ నటుడిగా మలయాళంలో సంపాదించిన నమ్మకాన్ని ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందు కూడా బాసిల్ నిలబెట్టుకోవాల్సిన టైమొచ్చింది. ఈ అవకాశాన్ని ఆయన ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటాడో చూడాలి. సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో బాసిల్, రజినీకాంత్ కొడుకు పాత్రలో కనిపించనున్నారని, ఈ సమ్మర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.