సంక్రాంతి ఆప్షన్ ను బాలయ్య వదులుకోవడం లేదా?

ఒక సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో సినిమాను లైన్‌ లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.;

Update: 2026-04-10 11:30 GMT

2027 సంక్రాంతి బరిలో బాలయ్య ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సరైన ప్లానింగ్‌ తో షూటింగ్స్‌ ను వేగంగా పూర్తి చేస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి పండగ రేసులో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో సినిమాను లైన్‌ లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.

నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలకృష్ణ ఒక పవర్‌ ఫుల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు! ఆ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించనుండగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందట.

అదే సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న సినిమాను కూడా ప్యారలల్ గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా సెట్స్‌పైకి వెళ్లేలోపు ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన కీలక షెడ్యూల్స్‌ను ముగించాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కచ్చితమైన షెడ్యూలింగ్‌ తో రెండు సినిమాలను సమాంతరంగా తీసుకెళ్తూ వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకం. గతంలో ఆ పండుగ సందర్భంగా విడుదలైన ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఆ సెంటిమెంట్‌ ను దృష్టిలో పెట్టుకుని విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

మొదట గోపీచంద్ మలినేని సినిమా సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ సినిమాను దసరా బరిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అలాగే బాలకృష్ణ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది. ఇక అభిమానులు కూడా బాలయ్య చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీకి బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌ తో రూపొందుతున్న సినిమా కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించనుంది. మొత్తానికి సరైన్ ప్రణాళికతో ముందుకు సాగుతున్న బాలకృష్ణ 2027 సంక్రాంతి బరిలో నిలవడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News