'బాహుబలి'కి మళ్లీ వందల కోట్లు సాధ్యమా?
ప్రభాస్‌పై అభిమానం, రాజమౌళి సినిమాలంటే పిచ్చి ఉన్న వారు ఖచ్చితంగా బాహుబలిని మళ్లీ చూసేందుకు థియేటర్ బాట పట్టడం ఖాయం.;
ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొంది వచ్చిన 'బాహుబలి' పదేళ్లు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బాహుబలి సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా నమోదు చేసిన చాలా రికార్డ్‌లు ఇంకా కూడా పదిలంగానే ఉన్నాయి. అప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా చూడని రికార్డ్‌లను బాహుబలి 2 చూసిన విషయం తెల్సిందే. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు కలిసి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.2500 కోట్లు నమోదు చేసి ఉంటాయి అనేది తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాహుబలి మళ్లీ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బాహుబలి 1 లేదా బాహుబలి 2 రీ రిలీజ్ అయితే జనాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఈసారి బాహుబలి ది ఎపిక్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
బాహుబలి ది ఎపిక్ రిలీజ్
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లకే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అలాంటిది రాజమౌళి సినిమా, అది కూడా రెండు పార్ట్‌లు కలిపి ఒకే పార్ట్‌గా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు గంటల సినిమాను మూడు గంటలకు కుదించడం ద్వారా మరింతగా బాగుంటుందని కొందరు నమ్ముతున్నారు. కొందరు మాత్రం తెలిసిన కథే కనుక కొత్తగా చూడ్డానికి ఏముందని అంటున్నారు. ప్రభాస్ అభిమానులు మాత్రం బాహుబలి సినిమాను మళ్లీ చూడటం కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి గతంలో మాదిరిగా వందల కోట్ల వసూళ్లు సాధించడం సాధ్యమేనా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.
ప్రభాస్, రాజమౌళి సినిమా
ప్రభాస్‌పై అభిమానం, రాజమౌళి సినిమాలంటే పిచ్చి ఉన్న వారు ఖచ్చితంగా బాహుబలిని మళ్లీ చూసేందుకు థియేటర్ బాట పట్టడం ఖాయం. ఇప్పటికే పదుల సార్లు టీవీల్లో, అంతకు మించి ఎక్కువ సార్లు ఓటీటీలో చూసిన ప్రేక్షకులు థియేటర్‌కి బాహుబలిని మళ్లీ చూసేందుకు రెడీగా ఉన్నారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు, కొందరు సినీ అభిమానులు భావిస్తున్నట్లుగా బాహుబలి మళ్లీ వందల కోట్ల వసూళ్లను చూడటం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. అయితే రాజమౌళి దృష్టి పెట్టి స్పెషల్ ఎడిట్ చేయించి, కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేయిస్తే ఖచ్చితంగా వందల కోట్ల నెంబర్స్‌ను మనం చూడటం పెద్ద కష్టం కాకపోవచ్చు అని పలువురు ప్రభాస్ అభిమానులు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ ఏం చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ప్రభాస్, అనుష్క మీడియా ముందుకు
బాహుబలి ది ఎపిక్ సినిమాను అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రముఖ పంపిణీదారులు ఈ సినిమాను పంపిణీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అంతే కాకుండా డైరెక్ట్ సినిమాను చేసినట్లుగా అత్యధిక థియేటర్‌లలో స్క్రీనింగ్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించేందుకు చేయవల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. విడుదలకు వారం ముందు ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళి, కీరవాణి ఇలా అందరూ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడటం ద్వారా రిలీజ్ హైప్ పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే రోజు వేరే సినిమాలు ఉన్నా బాహుబలి దెబ్బకు ఆ ఆసినిమాను తప్పించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమా విడుదల అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనేది బాహుబలి అభిమానుల మాట.