ఆ నిర్మాతలు తీస్తే మళ్లీ 'బాహుబలి' లాంటి సినిమానే!
మరో 70 కోట్లు అదనంగా వెచ్చించి 250 కోట్లతో రెండవ భాగాన్ని ఎంతో వైభవంగా నిర్మించారు. దీంతో `బాహుబలి`తో నిర్మాతలకు పాన్ ఇండియాలో మంచి పేరు వచ్చింది.;
`బాహుబలి` చిత్రాన్ని ఆర్కామీడియా వర్క్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నిర్మించిన మొట్ట మొదటి భారీ బడ్జెట్ చిత్రంగా ఓ కొత్త రికార్డునే నెలకొల్పింది. అప్పటి వరకూ సినిమా నిర్మాణం అంటే? 50-60 కోట్లలోనే కనిపించేది. రీజనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే నిర్మించేవారు. దీంతో తొలిసారి `బాహుబలి ది బిగినింగ్` కోసం ఏకంగా 180 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించారు. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగం బడ్జెట్ భారీగా పెంచారు.
బాహుబలి స్పూర్తితోనే మరిన్ని:
మరో 70 కోట్లు అదనంగా వెచ్చించి 250 కోట్లతో రెండవ భాగాన్ని ఎంతో వైభవంగా నిర్మించారు. దీంతో `బాహుబలి`తో నిర్మాతలకు పాన్ ఇండియాలో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా స్పూర్తితోనే మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్నాయి. అయితే శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ తర్వాత మళ్లీ మరో పాన్ ఇండియా సినిమా నిర్మించలేదు. `బాహుబలి`తోనే పాన్ ఇండియా చిత్రాన్ని సరిపెట్టుకున్నారు. మరి ఏ కారణంగా పాన్ ఇండియా సినిమాలు నిర్మించలేదు? అన్న సందేహాన్ని శోభు ముందు ఉంచితే..
నచ్చిన కథలతోనే నిర్మాణం:
ఆయన నిర్మిస్తే మళ్లీ `బాహుబలి` రేంజ్ సినిమా తప్ప మరో సినిమా నిర్మించేలా కనిపించలేదు. `ఓ పెద్ద సినిమా చేయాలంటే అన్నీ కలిసి రావాలి. కథలు, దర్శకులు, మార్కెట్ ఇలా అన్నీ ఒకేసారి కలిసి వచ్చినప్పుడే `బాహుబలి` లాంటి సినిమాలు సాధ్యమవుతుంటాయి. మాదృష్టి ఎప్పుడు నచ్చిన కథలు నిర్మించడంపైనే ఉంటుంది. `బాహుబలి` సినిమా తర్వాత కూడా చాలా పరిమితంగానే సినిమాలు నిర్మించామన్నారు. ఒకవేళ మళ్లీ పాన్ ఇండియా సినిమా చేస్తే గనుక అది `బాహుబలి` రేంజ్ లో ఉండాలి? అంతకు మించాలే తప్ప తగ్గకూడదు అన్నట్లు శోభు మాటల్లో బయట పడింది.
ఆమాట అక్షర సత్యం:
ఆయన చెప్పింది అక్షర సత్యం. `బాహుబలి` లాంటి గొప్ప సినిమాను భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన నిర్మాతల నుంచి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే? అంచనాలు అంతకు మించే ఉంటాయి. అది 1000కోట్ల ప్రాజెక్ట్ అయి ఉండాలి. ప్రత్యేకించి టాలీవుడ్ సినిమా పాన్ ఇండియాని దాటి వరల్డ్ కి రీచ్ అవుతోన్న నేపథ్యంలో ఆ రేంజ్ లోనే సినిమా ఉండాలి. ఇలా ఉండాలి అంటే? అన్నీ శోభు చెప్పినట్లు కుదిరితేనే సాధ్యమవుతుంది.