ఫైనల్‌గా తలైవర్‌కు డైరెక్టర్ దొరికాడా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, వెర్సటైల్ ఆర్టిస్ట్, లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, వెర్సటైల్ ఆర్టిస్ట్, లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా వీరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇద్దరు కలిసి గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ తమదైన మార్కు సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తూ సూపర్‌స్టార్స్ అనిపించుకున్నారు. ఇండియన్ సినిమాకు ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ చేసిన కంట్రీబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఏడు పదులు దాటిన వయసులోనూ తమదైన మార్కు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ నేటీ తరం హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరి కలిసి నటిస్తే చూడాలని ఎంతో కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రజనీ 173 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తానని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఇది పూర్తిగా రజనీ ఫిల్మ్ ఇందులో కమల్ ప్రొడ్యూసర్ మాత్రమే. దీనికి డైరెక్టర్‌గా సుందర్.సి ని అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు.
కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకుండానే సుందర్ సీ తప్పుకున్నాడు. అనుకోని పరిస్థితుల కారణంగా తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. రజనీకాంత్, కమల్ హాసన్ అభిమానులకు కలిగిన నిరాశకు నిజంగా క్షమాపణలు చెబుతున్నానంటూ సుందర్ సీ ఓ లెటర్‌ని విడుదల చేసి అందరిని అవాక్కయ్యేలా చేశాడు. దీంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో కమల్ డైరెక్టర్‌ని అన్వేషించడం మొదలు పెట్టాడు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్స్‌గా లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్‌ల పేర్లు వినిపించాయి. ఇదే వరుసలో రామ్‌కుమార్ బాలకృష్ణ పేరు కూడా ప్రధమంగా వినిపించింది. రజనీకి రామ్‌కుమార్ బాలకృష్ణ కథ చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చిందని వార్తలు వినిపించాయి. ఇందు కోసం కమల్ అతనికి రూ.10 కోట్లు పారితోషికం ఇవ్వనున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ లిస్ట్‌లో మరో పేరు వినిపిస్తోంది. తనే అశ్వత్ మారిముత్తు. రీసెంట్‌గా ప్రదీప్ రంగనాథన్‌తో `డ్రాగన్` వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని హాట్ టాపిక్ అయ్యాడు.
రీసెంట్‌గా రజనీకి విత్ స్క్రీన్‌ప్లేతో స్టోరీ నరేట్ చేశాడట, రజనీకి ఎంతగానో నచ్చిందట. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా ఉండటంతో రజనీకి బాగా నచ్చిందని, త్వరలోనే కమల్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అదే నిజమైతే అశ్వత్ మారిముత్తు కెరీర్ సరికొత్త మలుపు తిరిగినట్టేనని, రజనీ నుంచి న్యూ ఏజ్ సినిమా పక్కా అని అంతా అంటున్నారు. ప్రస్తుతం రజనీ `జైలర్ 2`ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో అతిథి పాత్రలో షారుక్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్, మిథున్ చక్రవర్తి మాత్రమే ఇందులో అడిషనల్‌గా కనిపించనున్నారు.