నటుడు ఆశిష్ విద్యార్థికి యాక్సిడెంట్
ఈ శుక్రవారం నాడు నేను, రూపాలీ రోడ్డు దాటుతున్నప్పుడు ఒక బైక్ మమ్మల్ని ఢీకొట్టింది. మేమిద్దరం క్షేమంగా ఉన్నాము.;
నటుడు ఆశిష్ విద్యార్థి ఆయన భార్య రూపాలీ బారువా గువహతిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్ఠవశాత్తూ ఈ జంట ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదు. ఈ విషయంపై ఆశిష్ అధికారికంగా వివరాలందించారు. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తాము గాయపడ్డామని, అయితే ఇప్పుడు క్షేమంగా ఉన్నామని తెలిపారు. తనకు స్వల్ప గాయాలయ్యాయి. కానీ రూపాలీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది అని తెలిపాడు.
ఈ శుక్రవారం నాడు నేను, రూపాలీ రోడ్డు దాటుతున్నప్పుడు ఒక బైక్ మమ్మల్ని ఢీకొట్టింది. మేమిద్దరం క్షేమంగా ఉన్నాము. రూపాలీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అంతా బాగానే ఉంది.. నేను బాగున్నాను. చిన్న గాయం అయింది... కానీ పూర్తిగా క్షేమంగా ఉన్నాను.. నేను ఈ విచిత్రమైన పరిస్థితిలో లైవ్ లో మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
ఈ ప్రమాద వార్తను `సంచలనం చేయాల్సిన అవసరం లేదు` అని కూడా ఆశిష్ విద్యార్థి ఆవేదనను వ్యక్తం చేసారు. మీడియా సెన్సేషనలిజానికి ఆయన కలత చెందారు. అలాగే తన అభిమానులు కలత చెందకుండా చానెల్ లైవ్ లో అటూ ఇటూ నడుస్తూ కనిపించాడు. ఇదంతా కేవలం మీకు తెలియడానికే. బైక్ నడిపిన వ్యక్తికి కూడా స్పృహ వచ్చిందని నేను ఇప్పుడే పోలీసుల ద్వారా తెలుసుకున్నాను. అందరూ బాగుండాలి.. అందరూ క్షేమంగా ఉండాలి. మీతో కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. మేము చాలా జాగ్రత్తలు తీసుకోండి.. అని అన్నారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నా కానీ తామిద్దరూ క్షేమంగానే ఉన్నామని కూడా అన్నారు.
పోకిరి, చిరుత సహా టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆశిష్ విద్యార్థికి ఇక్కడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆశిష్ 2023లో రూపాలీ బారువాను వివాహం చేసుకున్నారు. అంతకు ముందు అతడు మొదటి భార్య నుంచి 2022లో విడిపోయాడు. 22 సంవత్సరాలు వివాహ బంధం ముగిసింది. ఇటీవల ఆశిష్ `ది ట్రెయిటర్స్` అనే రియాలిటీ షో తొలి సీజన్ లో కనిపించాడు.