సినిమాను కబ్జా చేసిన హీరో..!

Update: 2019-09-10 08:41 GMT
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయలోకం. బయట ప్రపంచంలో ఉన్న మంచీచెడు ఇక్కడ కూడా ఉంటాయి.  అందులో ఏమీ అనుమానం లేదు.  అయితే ఇక్కడ రెండూ కాస్త ఎక్కువగా ఉంటాయి.  సక్సెస్ చాలా తక్కువగా ఉండే పరిశ్రమ కావడంతో చాలానే 'సిత్రాలు' కూడా జరుగుతూ ఉంటాయి.  రీసెంట్ గా అలాంటి చిత్రమే.. విచిత్రమే జరిగిందట.

అతనో యంగ్ హీరో.  చేసింది తక్కువ సినిమాలే.. అయితే మొదటి ప్రయత్నంగా చేసిన బోల్డ్ సినిమాతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించాడు.  ఆ దెబ్బకు ఆఫర్లు వెల్లువెత్తాయి.  ఆ ఊపులోనే ఒక అభిరుచి గల నిర్మాత ఇతనితో సినిమా మొదలు పెట్టాడు. దాదాపు 30% షూటింగ్ కూడా పూర్తయిందట. అయితే హీరోగారు "నాకు అది కావాలి.. ఇది కావాలి.. స్టార్ క్యాస్టింగ్ ఉండాలి" అంటూ ఊరికే గోల చేస్తుండడంతో ఆ బాధ భరించలేక 'నావల్ల కాదు బాబోయ్' అంటూ నిర్మాత విసిగిపోయాడట.  ఇక ఈ సినిమా చేయలేనంటూ చేతులేత్తేశాడట.   అయితే ఇదే అదనుగా తీసుకున్న హీరో ఆ 30% ఫుటేజ్ ను తీసుకొని ఆ సినిమాను తన సొంత బ్యానర్ పైకి షిఫ్ట్ చేసుకున్నాడట.

అదేమీ పెద్ద నేరం ఘోరం కాదే అని మీరు అనుకోవచ్చు కానీ ట్విస్టు అక్కడే ఉంది. ఒరిజినల్ నిర్మాతకు ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలి కదా? అలా చెయ్యకుండా ఆ సినిమాను కబ్జా చేశాడట.  ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News