ఆయ‌న‌తో మీకు సావాస‌మేంటి ర‌జ‌నీ?

Update: 2021-06-29 02:30 GMT
త‌మిళ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంట‌నేది స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌ను ఎంత‌గానో ఆరాధిస్తారు ఫ్యాన్స్‌. అలాంటి అభిమానులు త‌లైవా తీరుకు నొచ్చుకున్నారు. దీనికి కార‌ణం ఏమంటే.. ర‌జ‌నీ ఒక‌రితో దోస్తానా చేయ‌డ‌మే! ఇంత‌కీ ర‌జ‌నీ ఫ్రెండ్షిప్ చేసింది ఎవ‌రితో? ఫ్యాన్స్ కు ఎందుకు నచ్చలేదు? అన్న‌ది చూద్దాం.

ప్ర‌ముఖ త‌మిళ్ లిరిసిస్ట్ వైరముత్తు గురించి సాహిత్యాభిమానులంద‌రికీ తెలిసిందే. ఎంతో అద్భుత‌మైన సాహిత్యం అందించిన ఆయ‌న‌కు.. ప‌ద్మ‌భూష‌ణ్ మొద‌లు, ప‌ద్మ‌శ్రీ, కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డుతోపాటు ఏడు జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. ఇంత గొప్ప ర‌చ‌యిత‌ను లైంగిక వేధింపులు చుట్టుముట్టాయి.

గ‌డిచిన మూడేళ్లుగా లైంగిక ఆరోప‌ణ‌లు ఆయ‌న‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి మొద‌లు ప‌లువురు ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల కేర‌ళ ఓఎన్వీ అకాడ‌మీ అవార్డును ప్ర‌క‌టించడాన్ని కూడా చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. దీంతో.. అనివార్యంగా ఆ అవార్డును కూడా వ‌దిలేసుకున్నారు.

ఇదిలాఉంటే.. ర‌జ‌నీ హెల్త్ చెక‌ప్ కోసం అమెరికాకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ర‌జ‌నీ ఆరోగ్యంపై అభిమానుల‌కు ఎలాంటి స‌మాచార‌మూ అంద‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా వైర‌ముత్తు సోష‌ల్ మీడియాలో స్పందించారు. ర‌జ‌నీ త‌న‌కు ఫోన్ చేశార‌ని, ఆయ‌న హెల్త్ చాలా బాగుంద‌ని చెప్పార‌ని, ర‌జ‌నీ మాట‌ల్లో నూత‌నోత్తేజం క‌నిపించింద‌ని చెప్పారు.

వైర‌ముత్తు చెప్పిన స‌మాచారంతో కొంద‌రు ఆనందించినా.. మ‌రికొంద‌రు మాత్రం నిర‌స‌న తెలుపుతున్నారు. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వైర ముత్తుతో ర‌జ‌నీకి సావాసం ఏంట‌న్న‌ది వారి బాధ‌. అలాంటి వ్య‌క్తితో దోస్తానా స‌రికాద‌న్న‌ది వారి అభిప్రాయం. మ‌రి, దీనిపై త‌లైవా ఏమంటాడో?
Tags:    

Similar News