రెహ‌మాన్ త‌ప్పుగా అర్థం చేసుకున్నాడా?

ఏ.ఆర్. రెహ‌మాన్‌.. భార‌తీయ సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.;

Update: 2026-01-17 16:43 GMT

ఏ.ఆర్. రెహ‌మాన్‌.. భార‌తీయ సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అంద‌ని ద్రాక్ష‌లా ఇండియ‌న్ సినీ దిగ్గ‌జాల‌ని,ఇండ‌స్ట్రీని ఊరిస్తూ వ‌చ్చిన ఆస్కార్ పుర‌స్కారాన్ని ఇండియాకు తెచ్చిన ఘ‌నుడు. `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌`తో కోట్లాది మంది ప్రేక్ష‌కుల చిర‌కాల స్వ‌ప్న‌మైన ఆస్కార్‌ని సుసాధ్యం చేసి చూపించాడు. రెహ‌మాన్ అస‌లు పేరు దిలీప్ కుమార్‌. ప‌క్కా హిందువు. తండ్రి రాజ‌గోపాల కుల‌శేఖ‌ర‌న్ మ‌ల‌యాళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, త‌ల్లి క‌స్తూరి. కెరీర్ ప్రారంభానికి ముందు ఇస్లాంలోకి క‌న్వ‌ర్ట్ అయ్యాడు.

అక్క‌డి నుంచే అల్లా ర‌ఖ్కా రెహ‌మాన్‌గా పేరు మార్చుకున్నాడు. రోజా, జెంటిల్‌మెన్‌, దొంగ దొంగ‌ది, ప్రేమికుడు, బాంబే వంటి త‌దిత‌ర సూప‌ర్ హిట్ సినిమాల‌తో తిరుగులేని మ్యూజిక్ డైరెక్ట్ అనిపించుకున్నాడు. రంగీలా మూవీతో బాలీవుడ్ బాట ప‌ట్టిన రెహ‌మాన్ అక్క‌డ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ప్ర‌స్తుతం `దంగ‌ల్‌` ఫేమ్ నితేష్ తివారీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `రామ‌య‌ణ‌`కు హాలీవుడ్ కంపోజ‌ర్ హ‌న్స్ జిమ్మ‌ర్‌తో క‌లిసి సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ రిలీజ్ కానుంది.

ఈ మూవీకి వ‌ర్క్ చేస్తున్న రెహ‌మాన్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నేను ముస్లీం, హ‌న్స్ జిమ్మ‌ర్.. జేవిష్‌..రామాయ‌ణ స్టోరీ హిందూ క‌థ అని చెప్ప‌డం, అంతే కాకుండా బాలీవుడ్‌లో త‌న‌కు ఎనిమిదేళ్లు అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మ‌త‌త్వంగా మారిపోయింద‌ని, ఆ కార‌ణంగానే త‌న‌కు అవ‌కాశాలు రాలేద‌ని కామెంట్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఓ ప్ర‌ముఖ మీడియాతో ముచ్చ‌టిస్తూ రెహ‌మాన్ తాజా వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సృజ‌నాత్మ‌క‌త లేని వ్య‌క్తులు ఇప్పుడు ప‌వ‌ర్‌ని ఉప‌యోగించి నిర్ణ‌యాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. బ‌హుషా ఇది మ‌తత‌త్వ‌మైన విష‌యం కూడా కార‌ణం కావ‌చ్చు. చైనీస్ విస్ప‌ర్స్ మ్యూజిక్‌ కంప‌నీ ముందు న‌న్ను మ్యూజిక్ కోసం అనుకున్నార‌ని తెలిసింది. అయితే తరువాత నా స్థానంలో మ‌రో ఐదుగురిని తీసుకోవ‌డంతో నాకు విశ్రాంతి దొరికింద‌ని భావించాను. ఈ స‌మ‌యాన్ని నా ఫ్యామిలీతో గ‌డ‌ప‌వ‌చ్చ‌ని చెప్పాను` అన్నారు. ఎనిదేళ్లు త‌న‌కు బాలీవుడ్‌లో అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణం ఇండ‌స్ట్రీ మ‌త‌త్వంగా మార‌డ‌మేన‌ని ఓ ప్ర‌శ్న‌కు బ‌దులుగా తెలిపాడు రెహ‌మాన్‌. ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ ప్ర‌ముఖ రైట‌ర్ జావేద్ అక్త‌ర్ స్పందించారు.

రెహ‌మాన్ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడంటే నాకు సందేహంగానే ఉంది. అత‌నిపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అపార‌మైన గౌర‌వం ఉంది. అత‌ని హోదా కార‌ణంగానే త‌న‌ని సంప్ర‌దించ‌డానికి చాలా మంది వెనుకాడుతున్నారు. రెహ‌మాన్ స్టేట్‌మెంట్‌తో నేను ఏకీభ‌వించ‌ను. త‌ను గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు. చాలా మంది అత‌న్ని గౌర‌విస్తారు. అయితే త‌న లాంటి లెజెండ్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి, త‌న‌తో చ‌ర్చించ‌డానికి చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. ఆయ‌నపై ఉన్న గౌర‌వం, భ‌యం వ‌ల్లే ఆయ‌న‌కు అంతా దూరంగా ఉంటున్నారు. కానీ అంత‌కు మించి వేరే కార‌ణం లేద‌ని స్ప‌ష్టం చేశారు. జావేద్ అక్త‌ర్ వ్యాఖ్య‌ల‌తో రెహ‌మాన్ బాలీవుడ్‌లో త‌న‌కు వ‌చ్చిన గ్యాప్‌ని త‌ప్పుగా అర్థం చేసుకున్నాడ‌ని, ఇప్ప‌టికైనా అస‌లు నిజ‌మేంటో తెలుసుకోవాల‌ని బాలీవుడ్ వ‌ర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

Tags:    

Similar News