మేటి క‌థానాయిక‌లు మ‌ళ్లీ అభిమానుల కోసం వ‌స్తారా?

Update: 2021-03-24 03:30 GMT
ఇరుగు పొరుగు భాష‌ల నుంచి వ‌చ్చి టాలీవుడ్ లో ప్ర‌భావం చూపిన డ‌జ‌ను మంది నాటి మేటి క‌థానాయిక‌ల్లో కొంద‌రు తిరిగి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా రీఎంట్రీ ఇస్తే బావుంటుంద‌నేది అభిమానుల మాట‌. అలాంటి వారి జాబితా తిర‌గేస్తే.. న‌గుమోము న‌గ్మ‌.. అంజ‌లా జ‌వేరి.. సోనాలి బింద్రే లాంటి భామ‌లు ఉన్నారు. ఇక వీళ్ల‌తో పాటే అందాల ట‌బు ఇప్ప‌టికే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఒక‌సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. అరేబియ‌న్ గుర్రం అంటూ అభిమానుల నుంచి పిలుపందుకుని త‌నవైన అంద‌చందాలు న‌ట‌న‌తో మెప్పించ‌న న‌గ్మ తిరిగి క్యారెక్ట‌ర్ న‌టిగా రంగ ప్ర‌వేశం చేస్తారా? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే న‌గ్మ అప్ప‌ట్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ చిత్రం అల్ల‌రి రాముడులో న‌టించారు కానీ.. త‌ర్వాత మ‌ళ్లీ న‌టించే ఆలోచ‌న చేయ‌లేదు. ఘరానా మొగుడు స‌హా దాదాపు 20 తెలుగు చిత్రాల్లో న‌గ్మ  నటించారు. టాలీవుడ్ లో న‌గ్మ ముద్ర చెరిగిపోనిది.

అందాల ట‌బు 2020 బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠపురములో చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మ‌రోసారి త‌న‌దైన డీసెంట్ న‌ట‌న‌తో మురిపించారు. హైద‌రాబాదీనే అయినా హిందీ చిత్ర‌సీమ‌లో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించిన న‌గ్మ టాలీవుడ్ లో కూలీనంబ‌ర్ 1- నిన్నేపెళ్లాడుతా- ఆవిడా మా ఆవిడే- పాండురంగడు లాంటి చిత్రాల్లో న‌టించారు. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డ్ అందుకున్నారు. మునుముందు ఇంకా తెలుగు చిత్రసీమ‌లో న‌టించాల‌ని అభిమాను‌లు కోరుకుంటున్నారు.

మ‌రో అందాల నాయిక‌.. అంజ‌లా జ‌వేరి వెంకీ స‌ర‌స‌న ప్రేమించుకుందాం రా చిత్రంలో న‌టించి కుర్ర‌కారు మ‌నసు దోచారు. మెగాస్టార్ స‌ర‌స‌న చూడాల‌ని ఉంది .. బాల‌య్య‌తో స‌మ‌ర సింహారెడ్డిలో  నాగ్ తో రావోయి చంద‌మామ‌లో.. అంజ‌లా జ‌వేరి న‌ట‌న‌కు మంత్ర ముగ్ధం అయ్యారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో శేఖ‌ర్ క‌మ్ముల తిరిగి అంజ‌లా జ‌వేరీకి పిలిచి అవ‌కాశ‌మిచ్చారు. కానీ ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు.

సోనాలి బింద్రే గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మురారి- శంకర్ దాదా MBBS- ఇంద్ర‌-ఖ‌డ్గం- పలనాటి బ్రహ్మానాయుడు- మన్మధుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన సోనాలి బింద్రే ప్రేమికుల రోజు లాంటి క్లాసిక్ ల‌వ్ స్టోరీతో చెర‌గ‌ని ముద్ర వేసారు. టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న సోనాలి బింద్రే న‌టించారు. క్యాన్స‌ర్ ని ఎదుర్కొన్న త‌ర్వాత రీఎంట్రీ గురించి సోనాలి పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు.

సీనియ‌ర్ న‌టీమ‌ణుల్లో హేమ‌మాలిని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించారు. అలాగే కాజోల్ అప్ప‌ట్లో ధ‌నుష్ సినిమాతో సౌత్ లో రీఎంట్రీ ఇచ్చారు. మేటి న‌టి భానుప్రియ ఇటీవ‌ల పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. బాపు బొమ్మ స్నేహ అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల్లో క‌నిపిస్తున్నారు. ఇంద్ర‌జ .. రోహిణి.. రంభ లాంటి తార‌లు రీఎంట్రీ కోసం ట్రై చేసినా ఆ త‌ర్వాత పెద్ద‌గా ఇక్క‌డ వెల‌గ‌లేదు. కానీ వీరంతా న‌టిస్తే చూడాల‌న్న‌ది అభిమానుల హోప్.

త‌మ్ముడు ఫేం ప్రీతి జింగానియా ఏమైందో తెలీదు. రీఎంట్రీ ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చినా సౌత్ లో క‌నిపించ‌లేదు. శోభ లాంటి సీనియ‌ర్ న‌టి అప్ప‌ట్లో చాలా సినిమాల్లో క్యారెక్ట‌ర్ నటిగా క‌నిపించారు. కానీ ఇటీవ‌ల క‌నిపించ‌డం లేదు. వీళ్లంతా క‌నీసం అప్పుడ‌ప్పుడు అయినా మెరుపులు మెరిపిస్తే అభిమానులు తిరిగి త‌మ ఆరాధ్య న‌టీమ‌ణుల‌ను తెర‌పై చూసుకునే వీలుంటుంది.
Tags:    

Similar News