నువ్వు హీరో అవుతావా? అన్న ప్రశ్న బాధపెట్టింది – సుహాస్ ఎమోషనల్ కామెంట్

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ నుంచి వెండితెర వరకు సుహాస్ సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.;

Update: 2026-02-16 18:40 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ నుంచి వెండితెర వరకు సుహాస్ సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. కలర్ ఫోటోతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు హే భగవాన్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. అయితే, తాజాగా సత్యం రాజేష్‌తో జరిగిన ఇంటర్వ్యూలో సుహాస్ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న అవమానాలపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయటకు నవ్వుతూ కనిపించే సుహాస్ వెనుక ఎంతటి వేదన ఉందో ఈ మాటలు వింటే అర్థమవుతుంది.

నువ్వు హీరో అవుతావా? ఆ ప్రశ్న నన్ను బాధపెట్టింది:

హే భగవాన్ ప్రమోషన్లలో భాగంగా సత్యం రాజేష్ అడిగిన ఒక ప్రశ్నకు సుహాస్ చాలా నిజాయితీగా సమాధానమిచ్చాడు. "నువ్వు హీరో అవుతావని నీకు అనిపించిందా అని అందరి ముందు అడిగినప్పుడు బాధ పడ్డావా?" అని రాజేష్ అడగ్గా.. "అవును, చాలా బాధపడ్డాను. అందరినీ అలా అడగలేరు కదా, నన్ను కాబట్టి అలా అడుగుతున్నారు అనిపించింది" అంటూ సుహాస్ తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంట్ కంటే, బయట కనిపించే రూపం లేదా ఇమేజ్ ఆధారంగా జనం అడిగే ప్రశ్నలు తనను ఎంతగా గాయపరిచాయో ఈ మాటల ద్వారా స్పష్టమైంది.

నువ్వు ఎప్పుడో హీరోవి సుహాస్:

సుహాస్ మాటలకు స్పందించిన సత్యం రాజేష్, అతనికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. "నువ్వు యూట్యూబ్‌లో నటించేటప్పుడే ఒక హీరోవి, ఇప్పుడు ప్రత్యేకంగా హీరో అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తీసిన 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి చిన్నచూపు చూసే మాటలను అస్సలు పట్టించుకోవద్దు" అని రాజేష్ భుజం తట్టాడు. సుహాస్ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, అతని సినిమాల్లో ఉండే కంటెంట్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని రాజేష్ కొనియాడటం చుసిన వారందరినీ ఆకట్టుకుంది.

అవమానాలను భరించి, తన నటనతోనే సమాధానం చెబుతున్న సుహాస్, ఇప్పుడు 'హే భగవాన్' సినిమాపై భారీ ఆంచనాలు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 20న విడుదల కాబోతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్, సుహాస్‌కు మరో ఘనవిజయాన్ని అందిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నరేష్, శివాని నగరం వంటి నటులతో కలిసి చేసిన ఈ సినిమా, సుహాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని కోరుకుందాం.




Tags:    

Similar News