బట్టతలతో బిజినెస్ చేయడంలో తలపండిన నిర్మాత
సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతుండటంతో సామాన్యుల్లో కూడా దీనిపై ఆసక్తి, అదే సమయంలో అనేక అనుమానాలు పెరిగుతున్నాయి.;
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ప్రస్తుతం ఒక భారీ వ్యాపారంగా మారింది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతుండటంతో సామాన్యుల్లో కూడా దీనిపై ఆసక్తి, అదే సమయంలో అనేక అనుమానాలు పెరిగుతున్నాయి.
అయితే ఇటీవల బాలీవుడ్ కి చెందిన అగ్ర నిర్మాత ఈ వ్యాపారంలో బిజీ బిజీగా మారడం చర్చనీయాంశంగా మారింది. అతడు దీనికి బిజినెస్ ప్రమోటర్ గా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోను సినిమాలు నిర్మిస్తున్న ఆయన ముఖం బాగా ఫేమస్ కావడంతో ఈ వ్యాపారాన్ని నెట్‌వర్కింగ్ స్థాయికి తీసుకుని వెళ్లి భారీ లాభాల్ని కళ్లజూస్తున్నట్టు తెలుస్తోంది. అతడు కూడా ఒక పెద్ద కంపెనీతో వ్యాపార భాగస్వామిగా దీనిని ముందుకు తీసుకెళుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మించిన ఈ అగ్ర నిర్మాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌ల ప్రమోషన్లలో యాక్టివ్‌గా కనిపించడంతో యువతరం ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఓ ప్రయివేట్ ట్రాన్స్ ప్లాంట్ సంస్థతో కలిసి ఆయన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వైజాగ్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం చర్చగా మారింది. అయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వెనక నిజం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే.. ఇది కేవలం ఒక సర్వీస్ మాత్రమే కాదు.. కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన బిజినెస్. సెలబ్రిటీల యంగ్ లుక్ ను చూపిస్తూ.. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడం ద్వారా ఈ సంస్థలు భారీ ఆదాయాన్ని గడిస్తున్నాయి.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫలితాలు నిజమా? భ్రమనా?
చాలా మందికి ఉండే ప్రధాన సందేహం ఇది. బట్టతలపై వెంట్రుకలు మొలవడం అనేది శాశ్వతమా కాదా? అంటే.. పలువురు వినిపించే సిద్ధాంతాల పరంగా ఇది శాశ్వతం. ఎందుకంటే తల వెనుక భాగంలో డోనర్ ఏరియాలో ఉండే వెంట్రుకలు హార్మోన్ల ప్రభావానికి గురికావు. వాటిని తీసి ముందు భాగంలో నాటినప్పుడు.. అవి అక్కడే స్థిరపడి పెరుగుతాయి.
కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది?
అయితే కొందరికి ఇది ఫెయిల్ అవుతోందనే సమాచారం ఉంది. నాటిన వెంట్రుకలు పెరిగినా, వాటి చుట్టూ ఉన్న పాత (సహజమైన) వెంట్రుకలు ఊడిపోవడం వల్ల మళ్ళీ బట్టతల వచ్చినట్లు అనిపిస్తుంది. దీనివల్ల కొన్నాళ్లకే `మాయమైపోయింది` అనే భావన కలుగుతుంది. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా జీవితాంతం మందులు మినాక్షిడ్రిల్, ఫినాస్టెరైడ్ వంటివి వాడాల్సి ఉంటుంది. అవి ఆపేస్తే ఫలితం తగ్గిపోతుంది. అందరికీ వర్కవుట్ అవుతుందా? అంటే ఇది అందరికీ సాధ్యం కాదు. తల వెనుక భాగంలో నాణ్యమైన వెంట్రుకలు లేకపోతే ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ కాదు. అలాగే మరీ చిన్న వయసులో అంటే 25 లోపు చేసుకుంటే భవిష్యత్తులో మిగిలిన జుట్టు ఊడిపోయి చూడటానికి వింతగా తయారయ్యే ప్రమాదం ఉంది. డయాబెటిస్, ఇతర చర్మ వ్యాధులు ఉన్నవారికి ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వదు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వాస్తవ పరిస్థితి
ఎఫ్‌యుఇ (ఫిలిక్యులర్ యూనిట్ ఎక్స్ ట్రాక్షన్, DHT (డైరెక్ట్ హయిర్ ట్రాన్స్‌ప్లాంట్) వంటి టెక్నాలజీలు వచ్చాయి. ఇవి పాత కాలం నాటి `ప్లగ్స్` లాగా కాకుండా సహజంగా కనిపిస్తాయి. అయితే వెంట్రుకలు మొలిపించడం వెనక ప్రకటనల్లో నిజం ఎంతో తెలుసుకోవాలి. యాడ్స్ లో చూపించినంత దట్టమైన జుట్టు అందరికీ రాదు. అది మీ జుట్టు సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. చాలా సంస్థలు ఒక్కసారి చేసుకుంటే చాలు అని నమ్మిస్తాయి.. కానీ వాస్తవానికి అది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ.
టాలీవుడ్ నటుల రిజల్ట్ ఎలా ఉంది?
టాలీవుడ్‌లో పలువురు యువ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు దీని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నామని తెలిపారు. అయితే సరైన క్లినిక్, నిపుణులైన డాక్టర్లను ఎంచుకున్న వారికి రిజల్ట్ బాగుంది. అయితే సెలబ్రిటీలు కేవలం ట్రాన్స్‌ప్లాంట్‌పైనే ఆధారపడరు. వారు రెగ్యులర్‌గా పీఆర్‌పి (ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా) ట్రీట్‌మెంట్స్ తీసుకుంటారు. హై క్వాలిటీ హెయిర్ ప్యాచ్‌లు కూడా వాడుతుంటారు. దీనికోసం వేలు, లక్షల్లో ఖర్చవుతుంది.
ఇది స్వామీజీల వ్యవహారం వంటి మోసం కాకపోయినా.. అతిశయోక్తి కలిగిన మార్కెటింగ్ మాత్రం ఉందనేది బాధితులు గ్రహించాలి. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం సాధ్యమే.. కానీ అది ఖర్చుతో కూడుకున్నది. నిరంతర నిర్వహణ అవసరమైన ప్రక్రియ. కేవలం ప్రకటనలు చూసి కాకుండా.. మంచి వైద్యుడు( ట్రైకాలజిస్ట్)ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.