శర్వానంద్ ఈ సారి ట్రాక్ లోకి వచ్చేస్తాడా?

Update: 2021-05-26 01:30 GMT
శర్వానంద్ .. నిలకడ తెలిసిన నటుడు. కెరియర్ తొలినాళ్ల నుంచి కూడా ఆయన అవకాశాల విషయంలో తొందర పడినట్టుగా ఎక్కడా కనిపించదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చాడు. వీటిలో కొన్ని విజయవంతమయ్యాయి .. మరికొన్ని నిరాశను మిగిల్చాయి. అయినా ఆయన ఎప్పుడూ డీలాపడిపోయింది లేదు. నిదానంగా ... నిబ్బరంగా తన కెరియర్ ను నెట్టుకొస్తూనే ఉన్నాడు. కథల ఎంపిక విషయంలో నాని తరువాత అంతటి జాగ్రత్తలు తీసుకునే యువ కథానాయకుడిగా శర్వానంద్ కి మంచి పేరు ఉంది.

ఆ మధ్య వచ్చిన 'మహానుభావుడు' సినిమా శర్వానంద్ క్రేజ్ ను మరింత పెంచింది. ఆ సినిమాలో ఆయన నటనకు మరిన్ని మార్కులు పడ్డాయి. కామెడీ పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్న ఈ సినిమాతో శర్వానంద్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఆ తరువాత ఆయన చేసిన సినిమాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. తమిళంలో హిట్ కొట్టిన '96' కంటెంట్ కూడా, తెలుగులో 'జాను'గా ఆయనకి హిట్ ను ఇవ్వలేకపోయింది. ఇక ఇటీవల వచ్చిన 'శ్రీకారం' కూడా ఆయన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
Read more!

ప్రస్తుతం శర్వానంద్ 'మహా సముద్రం' చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోంది. వరుస పరాజయాల తరువాత శర్వానంద్ చేస్తున్న సినిమా కావడంతో, అభిమానులు కుతూహలంగా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ శర్వానంద్ కి చాలా అవసరం. లేకపోతే హిట్ అనే మాటకి ఆయన మరింత దూరమైపోయే అవకాశం ఉంది. 'ఆర్ ఎక్స్ 100' హిట్ తరువాత అజయ్ భూపతి కసిగా చేస్తున్న కథ కావడం వలన, అభిమానులు గట్టినమ్మకంతోనే ఉన్నారు మరి.    
Tags:    

Similar News