మహేష్ (X) అల్లు అర్జున్: ఈ మ్యాటర్‌లో పోటాపోటీ!
తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వెండితెరపైనే కాకుండా థియేటర్ల వ్యాపారంలోనూ ఒకరికొకరు గట్టి పోటీని ఇస్తున్నారు.;
తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వెండితెరపైనే కాకుండా థియేటర్ల వ్యాపారంలోనూ ఒకరికొకరు గట్టి పోటీని ఇస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ (AMB) సినిమాస్ ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న ప్రధాన బ్రాంచ్‌తో పాటు, ఇటీవల బెంగళూరులో కూడా ఏఎంబీ సినిమాస్ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌లో మరో కొత్త బ్రాంచ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తదుపరి హైదరాబాద్ లోనే హకీం పేటలో మరో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం కోసం ప్రణాళికలు ఉండగా, గోవా, చెన్నైలోను ఏఎంబి మాల్స్ నిర్మాణం కోసం ఏషియన్ తో కలిసి ప్లాన్ చేస్తున్నారని కూడా కథనాలొచ్చాయి.
మరోవైపు అల్లు అర్జున్ తన ఏఏఏ (AAA) సినిమాస్ బ్రాండ్‌ను శరవేగంగా విస్తరిస్తున్నారు. కోకాపేటలో నిర్మించిన అల్లు సినిమాస్ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. వాస్తవానికి ఈ సంక్రాంతికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ.. కొన్ని నిర్మాణ పనుల జాప్యం కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు దురంధర్ 2 ప్రీమియర్ తో ఇది మొదలవుతోందని సమాచారం. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ భారీ మల్టీప్లెక్స్ మరింత కళకళలాడబోతోంది. పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ థియేటర్ లో ఆడనుంది. ఇటీవల అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఇదే ప్రాంగణంలో నిర్వహించడం ద్వారా ఈ మల్టీప్లెక్స్ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు వైజాగ్ లోను ఏఏఏ (AAA) సినిమాస్ బ్రాండ్‌ను అల్లు అర్జున్ బృందం విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
కోకాపేట `ఏఏఏ సినిమాస్` ప్రత్యేకతలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద `డాల్బీ స్క్రీన్` ఈ థియేటర్ లో అందుబాటులో ఉంది. ఈ భారీ స్క్రీన్‌తో పాటు మరో మూడు స్క్రీన్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించబడే మొదటి పెద్ద చిత్రంగా `దురంధర్` సీక్వెల్ ఉండబోతోందని సమాచారం. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` వంటి భారీ చిత్రాలు ఇక్కడ సందడి చేయనున్నాయి. ఉగాదికి విడుదలయ్యే కొత్త సినిమాలు ఈ అత్యాధునిక స్క్రీన్లపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఏఎంబీ, ఏఏఏ సినిమాస్ మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన మల్టీప్లెక్స్‌లను నిర్మించేందుకు పోటీపడుతున్నారు. ప్రేక్షకులు కేవలం సినిమా చూడటమే కాకుండా ఒక లగ్జరీ యాంబియెన్స్ అనుభూతిని పొందేలా ఈ థియేటర్ల డిజైన్ ఉండటం విశేషం. ఏఎంబీ క్లాస్ లుక్‌తో ఆకట్టుకుంటుంటే, అల్లు సినిమాస్ టెక్నాలజీ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.
మల్టీప్లెక్స్ వ్యాపార రేసులో మహేష్, అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నా కానీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ రంగంలో తన అడుగులు వేస్తున్నారు. అయితే ప్రభాస్ తన థియేటర్ల వ్యాపారాన్ని నెల్లూరు వంటి ప్రాంతాలకు పరిమితం చేశారు తప్ప ఇప్పటివరకు హైదరాబాద్‌లో సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించలేదు. ప్రభాస్ నుంచి కూడా భవిష్యత్తులో హైదరాబాద్ మార్కెట్లోకి ఎంట్రీ ఉంటుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇతర అగ్ర హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం థియేటర్ల వ్యాపారంలో తటస్థంగా వ్యవహరిస్తున్నారు. వీరు తమ పూర్తి దృష్టిని సినిమాలపైనే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు , అల్లు అర్జున్ మాత్రమే ఈ రంగంలో స్పీడ్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ఈ ఆరోగ్యకరమైన పోటీ తెలుగు ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి థియేటర్ అనుభవాన్ని అందిస్తోంది.