నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్..
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ.. అభిమానులకు శుభవార్త తెలియజేస్తున్నారు.;
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ.. అభిమానులకు శుభవార్త తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా... మరొకవైపు అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికా రెడ్డితో మార్చి 6 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ వార్తను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిజం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కడ కూడా బయటపడలేదు. కానీ రెండు మూడు రోజులుగా ఇస్తున్న వరుస ఇంటర్వ్యూలలో తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించారు. కావ్య రెడ్డి అనే ఆమెతో ప్రేమలో ఉన్న ఈయన ఈరోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ , డైరెక్టర్ శ్రీను వైట్ల వచ్చి సందడి చేశారు .ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
కావ్య రెడ్డి విషయానికి వస్తే .. ఈమెకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు. కాకపోతే ఈమె తాతగారు జడ్జి కాగా ఈమె తండ్రి లాయర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబానికి కావ్య కుటుంబానికి మంచి పరిచయాలు ఉండడంతోనే.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఇకపోతే నిశ్చితార్థంతో ఒక్కటైన జంట ఈ ఏడాది ఆఖరిలో వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాబోయే నూతన జంటకు సినీ సెలెబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. మొదటి సినిమాతోనే ఏకంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. అంతేకాదు ఇదే సినిమా ద్వారా ప్రకాష్ రాజ్ కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఉత్తమ నూతన నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఇటీవల భైరవం, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా స్టార్ స్టేటస్ ను అయితే అందుకోలేకపోయారు. ఇక ఇప్పుడు కెరియర్ పరంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరొకవైపు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయిపోయారు. అందులో భాగంగానే తొలి అడుగులో నిశ్చితార్థం చేసుకున్నారు.