ఆస్కార్ ప్యానెల్: RRR ఎడిటర్ ఎంట్రీ.. మొత్తం ఎంతమంది ఉంటారంటే?
ప్రతి ఏడాది లాగానే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈసారి కూడా కొత్త సభ్యులకు ఆహ్వానాలు పంపింది.
వరల్డ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వెనుక పనిచేసే అకాడమీ ఓటింగ్ బాడీలో మరోసారి ఇండియన్స్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈసారి కొత్త సభ్యుల లిస్ట్ లో భారత్ నుంచి ఆరుగురు సినీ ప్రముఖులు చోటు సంపాదించడం విశేషం. అందులో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన ప్రముఖ ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ పేరు కూడా ఉంది.
ప్రతి ఏడాది లాగానే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈసారి కూడా కొత్త సభ్యులకు ఆహ్వానాలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 529 మంది సినీ ప్రముఖులకు ఇన్విటేషన్స్ అందాయి. వీరంతా మెంబర్ షిప్ ను అంగీకరిస్తే అకాడమీ మొత్తం సభ్యుల సంఖ్య 11,319కు చేరుతుంది. ఇందులో ఓటింగ్ హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 10,338గా ఉంటుంది. గత పదేళ్లలో అకాడమీ ఓటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెప్పాలి.
ఇండియా నుంచి ఎంపికైన వారిలో సంగీత దర్శకుడు, దర్శకుడు విశాల్ భరద్వాజ్, ప్రముఖ ఎడిటర్లు ఏ. శ్రీకర్ ప్రసాద్, దీపా భాటియా, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖాని, కాస్టింగ్ డైరెక్టర్ దిలీప్ శంకర్, యానిమేటర్ అవనీత్ కౌర్ ఉన్నారు. వివిధ విభాగాల్లో విశేష సేవలు అందించినందుకు వీరికి అకాడమీ నుంచి ఆహ్వానం లభించింది. అయితే తెలుగు ప్రేక్షకులకు శ్రీకర్ ప్రసాద్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
దాదాపు 40 ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ఎడిటర్లలో ఆయన ఒకరు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో వందలాది చిత్రాలకు ఎడిటింగ్ అందించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఆయన చేసిన ఎడిటింగ్ కు ప్రశంసలు లభించాయి. అదే సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలవడంతో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందింది.
శ్రీకర్ ప్రసాద్ సినీ నేపథ్యం కూడా ప్రత్యేకమే. భారతీయ సినీ దిగ్గజం ఎల్వీ ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆయన, దర్శకుడు-ఎడిటర్ అక్కినేని సంజీవి కుమారుడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఇప్పటివరకు 600కు పైగా చిత్రాలకు పనిచేసే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ఇక సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చి 14న జరగనుంది. ప్రముఖ హాలీవుడ్ హోస్ట్ కోనన్ ఓబ్రియన్ వరుసగా మూడోసారి హోస్టింగ్ చేయనున్నారు. అయితే ఆస్కార్ అకాడమీ సభ్యత్వం అనేది కేవలం గౌరవమే కాదు... ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సినీ అవార్డుల విజేతల ఎంపిక ప్రక్రియలో భాగస్వామ్యం కావడం కూడా. అలాంటి వేదికలో ఆర్‌ఆర్‌ఆర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో పాటు మరో ఐదుగురు ఇండియన్స్ చోటు సంపాదించడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణమే.