'మై బాడీ.. మై రైట్': చిన్మయి అలా.. వెంటనే సునీత ఇలా..

ఉమెన్ రైట్స్, ఫెమినిజంపై స్టార్ సింగర్ సునీత చేసిన కామెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

Update: 2026-06-26 03:52 GMT

ఉమెన్ రైట్స్, ఫెమినిజంపై స్టార్ సింగర్ సునీత చేసిన కామెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అనేక మంది నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మై బాడీ.. మై రైట్ అనే అంశంపై ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వాటిపై మరో సింగర్ చిన్మయి స్పందించగా, ఇప్పుడు సునీత మరోసారి వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల సునీత మాట్లాడుతూ, ఫెమినిజం అంటే కేవలం ఇష్టమైన దుస్తులు ధరించడం కాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మై బాడీ.. మై రైట్ అనే భావనపై మాట్లాడుతూ, మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని, అయితే సమాజం ఎలా ఉందో కూడా గుర్తుంచుకోవాలని అన్నారు. తనను తాను సేఫ్ గా ఉంచుకోవడం ముఖ్యం అని ఆమె వ్యాఖ్యానించారు.

ఆ కామెంట్స్ పై చిన్మయి స్పందిస్తూ సునీతను గౌరవిస్తానని చెప్పినా, ఆమె వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు దుస్తులతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మహిళల సెక్యూరిటీ వారి డ్రెస్సింగ్ తో లింక్ చేయడం సరైన సందేశం కాదని పేర్కొన్నారు. అయితే సునీత ఉద్దేశం వేరే అయి ఉండొచ్చని అన్నారు.

దీంతో సునీత తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో వీడియో పోస్ట్ చేశారు. చిన్మయిపై తనకు గౌరవం ఉందని మొదట క్లారిటీ ఇచ్చిన ఆమె, మై బాడీ.. మై రైట్ అనే దాన్ని అర్థం తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. అది మహిళ తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కును సూచిస్తుందని తెలిపారు. తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని కూడా సునీత వివరించారు. సమాజంలో మహిళలపై ఇంకా తప్పు దృష్టితో చూసే మనస్తత్వం ఉందని అన్నారు

అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త కూడా అవసరమనే భావనతో మాట్లాడానని చెప్పారు. అయితే ఎవరికైనా మహిళపై చేయి చేసేందుకు హక్కు లేదని స్పష్టం చేశారు. నా చేతి.. నా ఇష్టం అంటూ ఎవరైనా మహిళను వేధించడానికి ప్రయత్నిస్తే, అలాంటి వారి చేతులు విరగ్గొట్టాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను కూడా గతంలో వేధింపులను ఎదుర్కొన్న బాధితురాలినేనని సునీత వెల్లడించారు.

అందుకే మహిళలపై జరిగే అన్యాయాన్ని ఎప్పటికీ సమర్థించనని, లైంగిక వేధింపుల విషయంలో తన వైఖరి ఎప్పటికీ మారదని చెప్పారు. తాను చేసిన మొత్తంం కామెంట్స్ లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. "మహిళల పట్ల సమానత్వం, గౌరవం, వేధింపులపై జీరో టాలరెన్స్ అనే నా విలువలు ఎప్పటికీ మారవు" అని సునీత స్పష్టం చేశారు.

తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి చూడడం వల్లే తప్పుగా అనిపించిందన్నారు. అయితే ఇప్పుడు మొత్తం ఇన్సిడెంట్ లో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సునీత, చిన్మయి ఇద్దరూ ఒకరిపై ఒకరు పర్సనల్ కామెంట్స్ చేయకుండా తమ అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఒకరినొకరు గౌరవిస్తున్నామని చెబుతూనే తమ అభిప్రాయం చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఆ విషయంపై జోరుగా చర్చ కొనసాగుతోంది.




Tags:    

Similar News