తండ్రి, అన్నయ్య.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్!
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలో ఎదురైన విషాదాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు! రోడ్డు ప్రమాదాల్లోనే తన తండ్రి, పెద్దన్నయ్యను కోల్పోయానని చెప్పారు.;
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలో ఎదురైన విషాదాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు! రోడ్డు ప్రమాదాల్లోనే తన తండ్రి, పెద్దన్నయ్యను కోల్పోయానని చెప్పారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జరిగిన ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తారక్.. పలు కామెంట్స్ చేశారు.
బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రి ఓపెనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఆ ఆస్పత్రి భూమి పూజ కార్యక్రమాన్ని గతంలో ఆయన తాత, దివంగత సీనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం హోదాలో నిర్వహించగా.. ఇప్పుడు ప్రారంభోత్సవానికి మనవడు తారక్ రావడం విశేషం. అదే విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంది.
ఆ కార్యక్రమంలో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. రోడ్ సేఫ్టీపై ప్రత్యేకంగా మాట్లాడారు. వాహనం నడిపేటప్పుడు మన కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాలను మార్చేస్తుందని అన్నారు. ప్రమాదాల్లో తన కుటుంబ సభ్యులను కోల్పోయిన అనుభవం తనకు ఉందని ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఆ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరులో ఒక వివాహ వేడుకకు వెళ్లే సమయంలో నార్కెట్ పల్లి సమీపంలోని అన్నెపర్తి వద్ద ఆయన నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు.
అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పెద్దన్నయ్య నందమూరి జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2014 డిసెంబర్ 6న నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల గ్రామం సమీపంలోని నేషనల్ హైవే 65పై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆ రెండు సంఘటనలు తన కుటుంబానికి పెద్ద దెబ్బగా మిగిలిపోయాయని తారక్ ఇప్పటికే పలుమార్లు తెలిపారు.
ఇక.. చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ లో కనిపించడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. గుబురు గెడ్డంతో గ్యాంగ్ స్టర్ స్టైల్ లో ఆయన కొత్త లుక్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ప్రస్తుతం తారక్ దర్శకుడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రంపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో లుక్ వెంటనే వైరల్ గా మారింది. అయితే బెంగళూరు ఆస్పత్రి ఓపెనింగ్ లో తారక్ ఆదివారం పాల్గొనగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.