'సలార్' ఆగుతాడా? ముందుకు సాగుతాడా?

Update: 2021-04-09 02:30 GMT
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' రూపొందుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా షూటింగు గుజరాత్ లో జరగనుంది. ఇప్పటికే అక్కడ ఓ భారీ సెట్ ను వేయించారట. షూటింగు అంతా కూడా ఆ సెట్ లోనే జరగనుంది. అయితే గుజరాత్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వలన, అక్కడ షూటింగుకి అనుమతులు లభించడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.

అయితే 'సలార్' పాన్ ఇండియా సినిమా .. భారీ తారాగణంతో రూపొందుతోంది. ఒకసారి షూటింగు ఆగిపోయిందంటే మళ్లీ ఆర్టిస్టుల డేట్లు దొరకడం కష్టం. ఫైనాన్స్ లో తెచ్చిన డబ్బుకు వడ్డీలుకడుతూ వెళ్లాలి. అందువలన సాధ్యమైనంత వరకూ షూటింగు ఆగకుండానే చూసుకోవాలి. అందువలన సెట్లో జరిగే షూటింగు అనే చెప్పేసి  ప్రత్యేక అనుమతులు తీసుకునైనా షూటింగు చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఉందని అంటున్నారు. కరోనాకు భయపడకుండా ముందుకు వెళ్లడానికే టీమ్ నిర్ణయించుకుందని అంటున్నారు.

'సలార్' టీమ్ లో పట్టుదల బాగానే ఉంది గానీ, అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయనేది తెలియదు. ప్రతికూల పరిస్థితుల్లో 'సలార్' ఆగుతాడా? ముందుకు సాగుతాడా? అనేది చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ జోడీని తెరపై చూడటానికి అభిమానులంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ప్రభాస్ తాజా చిత్రంగా రానున్న 'రాధేశ్యామ్' కోసం కూడా వాళ్లంతా కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కరోనా భారీ ప్రాజెక్టులను బాగానే టెన్షన్ పెట్టేస్తోంది.  
Tags:    

Similar News