కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులు ఎవరి సొంతం?

Update: 2020-12-11 03:23 GMT
సినిమా అంటే ఓ పండగ .. ఓ సందడి .. ఓ ఉత్సవం. అందరికీ అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధనం సినిమానే. అది మహానగరాల్లోనివారినే కాదు .. మారుమూల గ్రామాలవారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఏ సినిమా అయినా సాధారణ ప్రేక్షకులకు రీచ్ అయితేనే అది ఆశించిన లాభాలను తెచ్చిపెడుతుంది .. కొత్త రికార్డులను ఇచ్చి వెడుతుంది. ఆయా హీరోలందరికీ అభిమానులు ఉంటారు. వాళ్లంతా కూడా మొదటి టికెట్టు తీసుకోవడం దగ్గర .. మొదటి ఆట చూడటం దగ్గర కూడా తమ అభిమానాన్ని చూపుతుంటారు. తమ హీరో సినిమానే కొత్త రికార్డులను సృష్టించాలని ఆరాటపడుతుంటారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది థియేటర్లన్నీ కూడా, గువ్వపిల్లలన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయిన గూళ్లలా వెలవెలబోయాయి .. వినోదానికి దూరంగా విలవిలలాడాయి.

ఇక ఇప్పుడు కరోనా మిగిల్చిన చేదు అనుభవాలను దులిపేసుకుని, కొత్త సంవత్సరంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టే సమయం వచ్చేసింది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోవడానికి ఎన్నో రోజులు పట్టవనే ఆశాభావం బలపడుతోంది. సెట్స్ పై ఉన్న భారీ ప్రాజెక్టులు షూటింగు పూర్తిచేసుకుని, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఆ సినిమాల్లో .. ఏయే సినిమాలు ఏ స్థాయిలో దూసుకెళతాయి? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తాయి? ఎలాంటి రికార్డులను తిరగరాస్తాయి? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' .. 'ఆచార్య' .. 'రాధేశ్యామ్' చిత్రాలు వచ్చే ఏడాది రంగంలోకి దిగనున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారు. బానిసత్వానికీ .. స్వేచ్ఛకి మధ్య జరిగే సంగ్రామం ఇది. దేశభక్తితో కూడిన బలమైన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. కథా నేపథ్యం .. పాత్రల వేషధారణ .. సన్నివేశాల చిత్రీకరణ .. విస్మయులను చేసే వీఎఫ్ ఎక్స్ .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి. కీరవాణి బాణీలు మనసులను గెలవనున్నాయి. భారీతనమే ప్రధాన లక్షణంగా కలిగిన ఈ సినిమాను, తెలుగుతోపాటు ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. థియేటర్స్ లోకి అడుగుపెట్టిన తరువాత పరిస్థితి అటుంచితే, థియేటర్లను నింపగలిగే జనాకర్షణ శక్తి రాజమౌళి 'స్టాంప్'కి ఉందనే సంగతి తెలిసిందే.

తెలుగు కథలను .. డాన్సులను .. ఫైట్లను కొత్తదనం దిశగా పరుగులు తీయించిన ఘనత మెగాస్టార్ సొంతం. ఈ తరంలోను కొత్త రికార్డులను సృష్టించడానికి ఆయన యువ కథానాయకులతో పోటీపడుతుండటం విశేషం. తన కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో 'సైరా' సినిమాను చేసిన ఆయన, మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. సందేశంతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ కథ నడుస్తుంది. కుటిల నీతికీ .. త్యాగనిరతికి మధ్య పోరాటంగా ఈ సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బలమైన అంశాలను కలుపుతూ కొరటాల అల్లుకున్న ఈ కథకి కనకాభిషేకం జరగడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

క్రితం ఏడాది 'సాహో' సినిమాలో తన మార్క్ యాక్షన్ ను చూపించిన ప్రభాస్, వచ్చే ఏడాదిలో రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. రొమాంటిక్ డ్రామాగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న 'రాధేశ్యామ్' సినిమాలో ఆయన నటిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం అంటున్నారు. డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళుతున్న ప్రభాస్, వచ్చే ఏడాది తన పాత రికార్డులను తిరగరాస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమా స్థాయిని పెంచే ఈ మూడు సినిమాల్లో, ఏది ఏ ర్యాంకు తెచ్చుకుంటుందో .. ఏది ఎక్కువ రికార్డు హెచ్చరికను ఎగరేస్తుందో చూడాలి.

ఇక 'వకీల్ సాబ్' భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా, పవన్ కి గల్ క్రేజ్ ను బట్టి చూస్తే పెద్ద సినిమాగానే పరిగణించవలసి ఉంటుంది. ఈ కథ బలమైనది .. విభిన్నమైనది .. విజయానికి అవసరమైన అంశాలు పుష్కలంగా ఉన్నది. ఈ కథ హిందీ .. తమిళ భాషల్లో పొందిన ఆదరణే అందుకు నిలువెత్తు నిదర్శనం. రాజకీయాలతో బిజీ కావడం వలన .. కోవిడ్ విలయతాండవం కారణంగా వచ్చిన గ్యాప్ తరువాత పవన్ చేస్తున్న తొలి సినిమా ఇది. అందువలన సహజంగానే అభిమానుల్లో ఆసక్తి .. ఆత్రుత అధికంగా ఉన్నాయి. వసూళ్ల పరంగా ఈ సినిమా వీరవిహారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మహేశ్ బాబు 'సర్కారువారి పాట' .. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా, కథా నేపథ్యాలు .. హీరోల స్టార్ డమ్ .. దర్శకుల ఇమేజ్ పరంగా చూసుకుంటే, అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఆ తరువాత వరుసలోని  హీరోలుగా నాని .. శర్వానంద్ .. విజయ్ దేవరకొండ .. నితిన్ .. రామ్ .. చైతూ .. అఖిల్ వచ్చే ఏడాదిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. వీళ్లందరిలో అఖిల్ కి హిట్ పడవలసిన అవసరం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి థియేటర్లన్నీ కళకళలాడాలనీ, కొత్త సినిమాలన్నీ వినోదాల సందడిచేస్తూ కాసుల వర్షం కురిపించాలని కోరుకుందాం.
Tags:    

Similar News