గర్భవతిగా ఉన్నప్పుడు అభిమాని అత్యుత్సాహం!
ఆకతాయిలతో సెలబ్రిటీల ఇబ్బందులు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అభిమానం పేరుతో హద్దులు మీరితే అది ఆకతాయితనానికి దారి తీస్తుందని ఎన్నో సందర్బాలు నిరూపించాయి.;
ఆకతాయిలతో సెలబ్రిటీల ఇబ్బందులు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అభిమానం పేరుతో హద్దులు మీరితే అది ఆకతాయితనానికి దారి తీస్తుందని ఎన్నో సందర్బాలు నిరూపించాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీ ఎదుర్కోన్న ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కియారా ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఓ అభిమాని ఆమెను గట్టిగా హత్తుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె బాడీగార్డ్ తాజాగా వెల్లడించాడు. ఈ ఘటన కియారాను మాత్రమే కాకుండా, భద్రతా సిబ్బందిని కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నాడు. నటీనటులు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు అభిమానులు సెల్ఫీల కోసం, కరచాలనం కోసం పోటీ పడుతుంటారు.
అయితే కియారా గర్భవతిగా ఉన్న విషయం తెలిసి కూడా ఓ అభిమాని ఆమెను ముందు నుంచి హత్తకునే ప్రయత్నం చేసాడుట. అంత దగ్గరకు రావడం చూసి ఆమె బాడీ గార్డ్ కూడా షాక్ అయ్యాడుట. సాధరణంగా గర్భవతి అని తెలిసినప్పుడు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తారు. అభిమాని ఆ సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. కానీ అభిమానం పేరుతో ఆకతాయి హద్దు మీరే ప్రయత్నం చేసే సరికి బాడీ గార్డ్ పక్కకు తొలగించి అడ్డు తప్పించాడుట. ఆ సమయంలో కియారా ఎంతో సున్నితమైన ఆరోగ్య స్థితిలో ఉన్నారని, ఒక్క క్షణం ఆలస్యమైనా పరిస్థితి తీవ్రంగా ఉండేదని భద్రతా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసారు.
సెలబ్రిటీల వ్యక్తిగత భద్రత, వారి ఆరోగ్య పరిస్థితులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఆ సమయంలో కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కొండంత అండగా నిలిచినట్లు చెప్పుకొచ్చారు. భార్య భద్రత విషయంలో ఎంతో నిబద్ధతతో ఉన్నారని బాడీగార్డ్ పేర్కొన్నారు. అప్పటి నుంచి సిద్ధార్థ్ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ కియారాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఒక స్టార్ హీరోగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే బాధ్యతాయుతమైన భర్తగా కియారా చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడుతున్నాడు.
షూటింగ్ లొకేషన్లలో, ఎయిర్‌పోర్టుల్లో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సెలబ్రిటీలు ఎంత ఒత్తిడికి లోనవుతారో ఈ ఉదంతంతో అర్దమవుతుంది. ఇలాంటి చేదు అనుభవాలు భవిష్యత్తులో సెలబ్రిటీల పబ్లిక్ అప్పియరెన్స్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానం అనేది హుందాగా ఉండాలి తప్ప అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల విషయంలో అభిమానులు మరింత బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రస్తుతం కియారా అద్వానీ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. కెరీర్ పరంగా గ్లోబల్ స్థాయిలో రాణిస్తున్నా? వ్యక్తిగత జీవితానికి ఆమె అంతే ప్రాధాన్యత ఇస్తోంది.