స్టార్ హీరో కుమార్తెకు ఆన్లైన్ వేధింపులు!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నితారా ఆన్‌లైన్ వేధింపులకు గురైన ఘటన తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2026-04-25 18:11 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నితారా ఆన్‌లైన్ వేధింపులకు గురైన ఘటన తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆన్‌లైన్ గేమ్ ఆడుతోన్న సమయంలో నిందితుడు ఆమెను అసభ్యకరమైన రీతిలో వేధించడమే గాక‌, నగ్న చిత్రాలను పంపాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అక్షయ్ కుమార్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. సెలబ్రిటీల పిల్లల భద్రత ఆన్‌లైన్ వేదికలపై ఎంత ప్రమాదంలో ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

విచారణ వివరాల ప్రకారం నిందితుడు మొబైల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నితారాను సంప్రదించాడు. మొదట సాధారణ ఆటగాడిగా పరిచయమై ఆ తర్వాత అసభ్యకరమైన సంభాషణలు మొదలుపెట్టాడు. మైనర్ అని తెలిసి కూడా ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ అభ్యంతరకర చిత్రాల కోసం వేధించాడు. ఈ విషయాన్ని నితారా తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అక్షయ్ కుమార్ వెంటనే స్పందించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వయసు , సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు విచారించారు.

సైబర్ పోలీసులు నిందితుడి ఐపి అడ్రస్ , గేమ్ అకౌంట్ వివరాలను చెక్ చేసి అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంత‌రం అతని మొబైల్ , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ఇలాంటి పద్ధతుల్లో మరికొందరు బాలికలను కూడా వేధించి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే? సామాన్యుల పిల్లల పరిస్థితి ఏంటి? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ గేమింగ్ అనేది పిల్లలకు ఒక వ్యసనంగా మారుతోంది. ఆటల మాటున మాటు వేసిన సైబర్ నేరగాళ్లు పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలు ఇంటర్నెట్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు. ఏ రకమైన గేమ్‌లు ఆడుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో సైబర్ భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గేమింగ్ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై వేధింపులను అరికట్టడానికి కఠినమైన ఫిల్టర్లను , భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలను సేకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసే ముఠాలు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతుంటాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో పిల్లలను ఒంటరిగా వదిలేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం మ‌రోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిప‌ట్ల ప్ర‌భుత్వాలు సీరియ‌స్ గా ఉండాల‌ని, క‌ఠిన‌మైన శిక్ష‌లు అమ‌లు చేయాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు కోరుతున్నారు. సైబర్ భద్రత పట్ల అవగాహన పెంచుకోవడం , పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను పంచుకునేలా చేయడం ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News