థియేటర్ల సిబ్బందిని ఆదుకునేది ఎవరు...?

Update: 2020-05-19 05:15 GMT
కంటికి కనిపించని ఒక మహమ్మారి వలన ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. కొన్ని లక్షల కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. మనదేశంలో కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఇప్పటికే అన్ని రంగాలలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. సినీ రంగం మీద కూడా ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. రెండు నెలల నుండి షూటింగ్స్ లేవు.. సినిమా థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడి పోయాయి. దీంతో కొత్త సినిమాల విడుదలలు లేవు. ఎప్పుడూ కొత్త సినిమాలతో కళకళ లాడుతుందే థియేటర్స్ వెలవెలబోతున్నాయి. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి అనేది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే సినీ ఇండస్ట్రీలోని రోజు వారీ కూలీలను.. కార్మికులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తూ వచ్చారు. కానీ థియేటర్స్ మీద ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. రెండు నెలల నుండి థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్ర్కీన్లు సుమారు 1200.. మల్టీప్లెక్లులు 500 దాకా ఉన్నాయి. వీటి మీద దాదాపుగా 35 వేల మందికి పైగా ఆధారపడి బ్రతుకుతున్నారు. చాలాచోట్ల థియేటర్లలో మార్చి నెల జీతాలిచ్చినా ఏప్రిల్‌ నుంచి సగం జీతాలే ఇస్తున్నారు. ఇక మే నెల పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ అవి కూడా శాశ్విత ఉద్యోగులకు మాత్రమే చెల్లిస్తున్నారు. టెంపరరీ ఉద్యోగులకు అది కూడా లేదు.

ఇకపోతే థియేటర్స్ ఓనర్స్ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. సిబ్బందికి ఎంతో కొంత జీతాలతో పాటు కరెంటు బిల్లులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి. గత రెండు మూడు నెలలుగా ఇన్కమ్ లేదు. ఇది ఇలాగే మరో రెండు మూడు నెలలు కొనసాగితే చాలా మంది థియేటర్ల ఓనర్లు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే తమ థియేటర్లను ఫంక్షన్ హాల్స్ గానో లేక గోడౌన్ల కిందో మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎవరో ఒకరికి లీజ్ కి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో లీజ్ కి ఇచ్చినా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం లేదు. సో థియేటర్ల మీద ఆధారపడి జీవిస్తున్న వారు గడ్డుకాలం ఎదుర్కుంటున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వాలు చెప్పేదానిని బట్టి చూస్తే మరో మూడు నెలలు షూటింగులు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అప్పటి దాకా పరిస్థితులను తట్టుకొని ఎన్ని జీవితాలు నిలబడతాయో చెప్పలేం. మరి థియేటర్ల మీద డిపెండ్ అయి జీవిస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. థియేటర్స్ మీద కరెంటు ఛార్జెస్ తగ్గిస్తే వారికి అంతో ఇంతో సహాయం చేసినట్లుంటుంది అని సినీ పెద్దలు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.
Tags:    

Similar News