నాని 'హుక్ స్టెప్' కాపీనా? నిజమెంత?
నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ నుంచి విడుదలైన ఆయా షేర్ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న వేళ.. కాపీ రైట్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ నుంచి విడుదలైన ఆయా షేర్ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న వేళ.. కాపీ రైట్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సాంగ్ లో నాని వేసిన హుక్ స్టెప్ కాపీ అంటూ ఓ డ్యాన్సర్ ఆరోపణలు చేయడం ఇప్పుడు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నాని బర్త్ డే సందర్భంగా ది ప్యారడైజ్ మూవీ టీమ్.. ఆయా షేర్ అనే మాస్ బీట్ సాంగ్ ను రిలీజ్ చేసింది. పాటలో మ్యూజిక్, విజువల్స్, ముఖ్యంగా నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందు చూడని మాస్ స్టైల్ లో నాని స్టెప్స్ వేయడంతో అంతా ఫిదా అయిపోయారు. అయితే ఆ హుక్ స్టెప్ నే ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది.
బాబా జాక్సన్ అనే డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. నాని వేసిన హుక్ స్టెప్ తనదేనని ఆరోపిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆయన.. తాను గతంలో చేసిన డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. తన స్టెప్ నే ఆయా షేర్ పాటలో మేకర్స్ కాపీ చేశారని పేర్కొన్నారు. రెండు వీడియోలు పోల్చి చూపిస్తూ ఇది ఒరిజినల్, ఇది కాపీ అంటూ పోస్ట్ చేయడంతో ఆ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది.
అయితే డ్యాన్సర్ ఆరోపణలపై సినీ ప్రియులతోపాటు నెటిజన్ల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు నిజంగానే స్టెప్స్ కాపీలా ఉన్నాయని అంటుంటే.. మరికొందరు డ్యాన్స్ స్టెప్స్ లో ఇలాంటి మూవ్స్ సాధారణమేనని, దాన్ని కాపీ అనడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. గతంలో కూడా పలువురు స్టార్ హీరోలు ఇలాంటి లెగ్ మూమెంట్స్ తో స్టెప్స్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెబుతున్నారు.
ఆయా షేర్ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించినది ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సుధన్ మాస్టర్. దీంతో కాపీరైట్స్ ఆరోపణలపై ఆయన లేదా మేకర్స్ స్పందిస్తారా లేదో చూడాలి. మొత్తానికి రిలీజ్ అయిన కొన్ని గంటల్లో చార్ట్ బస్టర్ గా నిలిచిన ఆయా షేర్ పాట.. ఇప్పుడు కాపీ వివాదంతో మరింత చర్చనీయాంశమైంది. ఆ విషయంపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ మూవీలో సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.