టాప్ స్టోరి: లెగ‌సీని ముందుకు న‌డిపించే ధీరులెంద‌రు?

Update: 2021-07-14 12:30 GMT
ఏ రంగంలోనైనా వార‌సులు తండ్రుల లేదా తాత‌ముత్తాత‌ల‌ లెగ‌సీని న‌డిపించాలంటే అది పెద్ద స‌వాల్ లాంటిది. స‌క్సెస్ తో తండ్రికి త‌గ్గ త‌న‌యులు అని నిరూపించుకోవాలి. తాత‌ల పేరు నిలబెట్టాలి. ఆ కోవ‌లో చూస్తే వార‌సులుగా నిరూపించుకోవ‌డ‌మే కాదు. ఇప్పుడా త‌న‌యులు తండ్రుల వెంట ఉండి న‌డిపిస్తున్నారు. కొంద‌రు అటు హీరోగా రాణిస్తూనే నిర్మాత‌గాను రాణిస్తున్నారు. కొంద‌రు నిర్మాత‌ల వార‌సులు త‌మ తండ్రుల లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డంలో స‌క్సెస‌య్యారు.

మెగాస్టార్ చిరంజీవి న‌ట వారుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ పెద్ద స్టార్ అయ్యారు.  చెర్రీ అగ్ర హీరోగా ఎద‌గ‌డ‌మే గాక‌ తండ్రి చిరంజీవి కోసం బ్యాన‌ర్ స్థాపించి వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీని ప్రారంభించి అందులో చిరుతో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించారు.  చిరంజీవి హీరోగా `ఖైదీ నంబ‌ర్ 150`- `సైరా న‌రసింహారెడ్డి` లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్రాండ్ వ్యాల్యూని పెంచిన చిత్రాలివి. అల్లు రామ‌లింగ‌య్య మ‌న‌వ‌డు అల్లు అర‌వింద్ వార‌సుడు బ‌న్ని గీతా ఆర్ట్స్ కి వెన్నుద‌న్ను. త‌న స్నేహితుడు బ‌న్నివాస్ తో జీఏ2 బ్యాన‌ర్ ని న‌డిపిస్తున్నాడు. ఆ రెండు సొంత నిర్మాణ సంస్థ‌ల ప్ర‌మోష‌న్ బాధ్య‌త బ‌న్నీదే. ఆహా ఓటీటీ స‌క్సెస్ బాట‌లో వెళ్ల‌డానికి బ‌న్ని చేస్తున్న ప్ర‌చార సాయం అంతా ఇంతా కాదు. అత‌డు ఏఏఏ బ్రాండ్ ని ఇండ‌స్ట్రీలో విస్త‌రిస్తున్నాడు. ది బెస్ట్ స‌క్సెస్ హీరోగా రాణిస్తూ స‌త్తా చాటుతున్నారు. తాత తండ్రి నుంచి వ‌చ్చిన లెగ‌సీని ముందుకు న‌డ‌ప‌డంలో ధీరుడ‌ని నిరూపిస్తున్నాడు.

హీరో రానా ద‌గ్గుబాటి మూవీ మోఘ‌ల్ రామానాయుడు లెగ‌సీని ముందుకు న‌డిపిస్తున్నారు. ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం స్టూడియో ఓన‌ర్.. ఇండ‌స్ట్రీ డీన్ సురేష్ బాబు వార‌స‌త్వంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి యువ ఎంట‌ర్ ప్రెన్యూర్ గా స‌త్తా చాటుతున్నారు. టాలీవుడ్ కి ఎంతో విలువైన కంటెంట్ ని అందించ‌డంలో రానా చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అత‌డు హీరోగా ఎన్నో క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే కంటెంట్ ఉన్న క‌థ‌ల‌ను త‌న‌వ‌ద్ద‌కు తెచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను ప్రోత్సహిస్తూ ది బెస్ట్ హీరో అనిపిస్తున్నారు.

న‌ట‌సార్వ‌భౌమ‌ ఎన్. టి రామారావు స్ఫూర్తితో... నంద‌మూరి హ‌రికృష్ణ వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించిన క‌ళ్యాణ్ రామ్ కూడా నంద‌మూరి తార‌క‌రామార‌వు ఆర్స్ట్ బ్యాన‌ర్ స్థాపించి నిర్మాత‌గా ఎదిగారు. త‌న సోద‌రుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. తండ్రి త‌ర‌హాలోనే కుటుంబ క‌థా చిత్రాల్ని ఆ బ్యాన‌ర్లో నిర్మించి ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. తాను కూడా హీరోగా షైన్ అవుతున్నారు. యువ‌హీరో మంచు విష్ణు .. క‌లెక్షిన్ కింగ్ మోహ‌న్ బాబు వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ స్థాపించి తండ్రి తో సినిమాలు నిర్మించారు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తున్న హీరోగా నిర్మాత‌గా అత‌డి కి గుర్తింపు ద‌క్కింది.

తండ్రి గారైన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ అడుగు జాడ‌ల్లోనే మ‌హేష్ ఆల్ రౌండ‌ర్ గా రాణిస్తున్నారు. హీరోగా నిర్మాతగా ఎదురే లేని స్థానంలో ఉన్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. మ‌హేష్ కెరీర్ ఆరంభం సోద‌రుడు ర‌మేష్ బాబు నిర్మించిన చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు తానే నిర్మాత‌గా మారి నేటిత‌రం హీరోల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. భ‌విష్య‌త్ లో జీఎంబీ బ్యాన‌ర్ లో ఘ‌ట్ట‌మ‌నేని వార‌సుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఆస్కారం ఉంది.

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న తండ్రి గారి బ్యాన‌ర్ గోపి కృష్ణ మూవీస్ ప్ర‌భ‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. యువి క్రియేష‌న్స్ తో క‌లిపి గోపి కృష్ణ బ్యాన‌ర్ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తోంది. రాధేశ్యామ్ తో ఈ బ్యాన‌ర్ విలువ అమాంతం పెర‌గనుంది. స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌భాస్ నిర్మాత‌గా ఎగ్జిబిట‌ర్ గా మ‌ల్టీప్లెక్స్ ఓన‌ర్ గా స‌త్తా చాటుతున్నారు. లెగ‌సీని పాన్ ఇండియా లెవ‌ల్లో దిగ్విజ‌యంగా న‌డిపిస్తున్న మేరున‌గ‌ధీరుడు ప్ర‌భాస్.

అలాగే యువ హీరోలు సందీప్ కిష‌న్.. నాగ‌శౌర్య స‌హా ప‌లువురు హీరోలు న‌టులుగా రాణిస్తూనే నిర్మాణ రంగంలోనూ వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఇంకొంత మంది స్టార్ హీరోలు.. యువ క‌థానాయ‌కులు కూడా ప‌రోక్షంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మెగా కాంపౌండ్ అండ‌దండ‌ల‌తో బ‌రిలో దిగిన శ‌ర్వానంద్ త‌న సినిమాల‌కు తానే నిర్మాత‌గా కొన‌సాగారు. తాత‌లు తండ్రుల లెగ‌సీని ముందుకు న‌డిపించ‌క‌పోయినా త‌మ‌కంటూ ఒక అడ్డాను నిర్మించుకుంటున్నారు.

టాలీవుడ్ కింగ్ ప్ర‌స్థానం వేరు:

టాలీవుడ్ లో అగ్ర హీరోగా నిర్మాత‌గా నాగార్జున ప్ర‌స్థానం సుదీర్ఘ‌మైన‌ది. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో త‌న తండ్రి స‌హా కుటుంబ హీరోలంద‌రితో క‌లిసి మ‌నం సినిమాని నిర్మించారు. త‌న వార‌సులు నాగ‌చైత‌న్య‌.. అఖిల్ ల‌తో ఈ బ్యాన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు నిర్మించ‌నున్నారు. ఆస‌క్తిక‌రంగా నాగ‌చైత‌న్య - స‌మంత జంట నిర్మాత‌లుగా మారి సొంత బ్యాన‌ర్ల‌ను ఎస్టాబ్లిష్ చేసే ఆలోచ‌న‌తో ఉన్నార‌ని ప్ర‌చార‌మవుతోంది. ఇక నాగార్జున‌- చిరంజీవి క‌లిసి ఒక సొంత ఓటీటీ ని ప్లాన్ చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఓటీటీల్లో ఫ్యామిలీ హీరోల‌తో బోలెడంత కంటెంట్ ని అందించేందుకు ఆస్కారం ఉంద‌ని ఓ అంచ‌నా.
Tags:    

Similar News