ఓటీటీ వేదిక‌ లేక‌పోతే క్రైసిస్ లో నిర్మాత ప‌రిస్థితి ఏంటి?

Update: 2021-07-06 00:30 GMT
క‌రోనా వైర‌స్ దాడి ప్రారంభ‌మైన నాటి నుంచి సినిమాలు ఎక్కువ‌గా ఓటీటీల్లో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారి కార‌ణంగా పెట్టిన పెట్టుబ‌డైనా రాబ‌ట్టుకోవాల‌ని నిర్మాత‌లు భారీ లాభాలు ఆశించ‌కుండా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. వాస్త‌వానికి అన్నిరంగాలు క‌న్నా సినిమా రంగంపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపించిద‌న్న‌ది వాస్త‌వం. సినిమా నిర్మాణం ఆగిపోవ‌డంతో కార్మికులంతా రోడ్డున ప‌డ్డారు. గ‌త ఏడాదిన్న‌ర‌గా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే ప‌రిస్థితి. అడ‌పా ద‌డ‌పా షూటింగ్ లు జ‌రుగుతోన్న ప‌రిమితంగానే కార్మికుల‌కు ప‌ని దొరుకుతుంది. మిగ‌తా వారంతా ఖాళీగా కూర్చోవ‌ల్సిన ప‌రిస్థితి.

ఇక నిర్మాత‌లు తీవ్ర న‌ష్టాల్ని భ‌రించాల్సి వ‌చ్చింది. సినిమా కోసం చేసిన అప్పులు తీర్చ‌లేక...రెడీ అయిన సినిమా ని రిలీజ్ చేయ‌లేక ఇబ్బందులు ప‌డ్డారు. ఫ‌లితంగా అప్పులు మీద వ‌డ్డీల భారం ఎక్కువైంది.  అగ్ర నిర్మాత నుంచి చిన్న స్థాయి నిర్మాత వ‌ర‌కూ అంద‌రి ప‌రిస్థితి ఇదే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓటీటీనే కాస్త నిర్మాత‌ల్ని ఆదుకుంటుంద‌న్నది వాస్త‌వం. నిజానికి అలాంటి ప్లాట్ ఫాం లేక‌పోతే సినిమా ప‌రిస్థితి ఎలా ఉండేది?  థియేట్రిక‌ల్ బిజినెస్ లేక‌పోతే రిలీజ్ లు ఎలా చేసేవారు? అన్న‌ది ఆగ‌మ్య‌గోచ‌రం. దీనివ‌ల్ల‌  నిర్మాత ఇంకెంత ఆర్ధిక భారం మోయాల్సి ఉండేదో చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇప్పుడు ఓటీటీల్లో కూడా సినిమా రిలీజ్ చేయ‌కూడ‌దంటూ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఒక‌వేళ అదే గ‌నుక జ‌రిగితే నిర్మాత నిండా మునిగిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇండ‌స్ట్రీలో 24 శాఖ‌లు స‌క్ర‌మంగా న‌డ‌వాలంటే నిర్మాత బాగుండాలి. నిర్మాత  బాగుంటేనే హీరో ఉంటాడు.. ద‌ర్శ‌కుడు ఉంటాడు..కార్మికులు బతికేందుకు ఆస్కారం ఉంది. నిర్మాత‌ల గొప్ప‌ద‌నం గురించి ప్ర‌తీ ఒక్క‌రు నిర‌భ్యంత‌రంగా చెప్పే మాట ఇది. ఈ  నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో న‌ష్టాలు లేకుండా..భారీ లాభాలు రాక‌పోయినా ఓటీటీల్లో సినిమా రిలీజ్ అవ్వ‌డం ఉత్తమమ‌ని మెజార్టీ సినీజ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాత‌లంతా ఓటీటీ లు ఉండాల‌నే కోరుకుంటున్నారు. వారి సినిమాల‌కు అతి పెద్ద డీల్స్ ని కుదుర్చుకుంటూ మినిమం రాబ‌డుల‌ను అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓటీటీల్లో రిలీజ్ ల‌కు వ‌స్తున్న సినిమాల‌న్నీ పేరున్న నిర్మాత‌లకు చెందిన‌వే. మునుముందు అర‌డ‌జ‌ను పైగా క్రేజీ తెలుగు చిత్రాలు ఓటీటీల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News