కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ లొల్లేంటి?

Update: 2022-11-11 16:30 GMT
టాలీవుడ్ లో 24 శాఖ‌లు ఉంటే అందులో దేనిక‌దే ప్ర‌త్యేకం. ఇందులో కాస్టింగ్ డైరెక్ట‌ర్ల అసోసియేష‌న్ పాత్ర చిన్న‌దేమీ కాదు. సినిమా క‌థ‌కు త‌గ్గ‌ట్టు ఆర్టిస్టుల‌ను ఎంపిక చేసే బాధ్య‌త వీళ్ల‌దే. ద‌ర్శ‌కుడితో క‌లిసి చాలా ఎంపిక‌లు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి కీల‌క‌మైన శాఖ‌పై ప‌లు ఆరోప‌ణ‌లు అంతే వేగంగా గుప్పుమంటాయి. అవ‌కాశాల పేరుతో మోడ‌ల్స్ ని న‌టీమ‌ణుల‌ను వ‌ల వేసే కేటుగాళ్లు బ‌య‌ట‌ప‌డేది ఈ రంగంలోనే అన్న బ్యాడ్ నేమ్ కూడా ఉంది. అయితే కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఇలాంటి నెగెటివిటీ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌రికొత్తగా స‌మాలోచ‌న‌లు చేయాల్సి ఉంద‌న్న డిమాండ్ టాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో ఉంది.

ఈ రంగంలోకి నిజాయితీగా ప్ర‌వేశించే వారికి బ్యాడ్ నేమ్ రాకుండా త‌మ‌ను తాము డిపెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్లు.. కాస్టింగ్ మేనేజ‌ర్ల‌పై వ‌చ్చే స‌వాల‌క్ష ఆరోప‌ణ‌ల‌న్నిటికీ చెక్ పెట్టక‌పోతే ఆ మేర‌కు ఆర్టిస్టుల‌తో స‌ఖ్య‌త కూడా అంత‌గా వీలు ప‌డని ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న టాక్ ప‌రిశ్ర‌మ‌లో ఉంది.

అందుకే ఇలాంటి విష‌యాల‌తో పాటు కాస్టింగ్ డైరెక్ట‌ర్ల విధి విధానాల‌ను చ‌ర్చించేందుకు ఇప్పుడు టాలీవుడ్ లో ఈ శాఖ స‌మావేశానికి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌క‌ట‌న ఇప్పుడు వేడి పెంచుతోంది. ``ప్రియమైన కాస్టింగ్ డైరెక్టర్స్ అందరికీ ..చాలా ముఖ్యమైన నోటీసు ఇది. అందరు కాస్టింగ్ డైరెక్టర్ల కోసం ఈ ముఖ్య‌మైన‌ సమావేశం ఏర్పాటు చేసాం. 13 నవంబ‌ర్ 2022న ఉదయం 9:00 గంటలకు కార్యాలయానికి రావాలని అభ్యర్థిస్తున్నాము. తద్వారా మనమందరం పరిశ్రమలో మరింత ముందుకు వెళ్లడంపైనా అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడం పైనా చర్చించి ప్లాన్ చేసుకోవచ్చు. ఇత‌ర ఆరోప‌ణ‌లు స‌మ‌స్య‌ల‌పైనా ఈ వేదిక‌పై చ‌ర్చించి ప్ర‌తిదీ ప‌రిష్క‌రించుకుందాం`` అని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి  కేవ‌లం కేస్టింగ్ డైరెక్టర్లు మాత్రమే హాజ‌రు కావాల‌ని కూడా స్ప‌ష్ఠంగా పిలుపునిచ్చారు. అలాగే మెంబర్ షిప్ ID కార్డ్ ను అప్లై చేయాలనుకుంటే ఒరిజినల్ ఆధార్- పాన్ కార్డ్ - 2PP సైజ్ ఫోటోలతో ద‌ర‌ఖాస్తు చేయాల‌ని కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. గణపతి కాంప్లెక్స్ వెనుక శ్రీనగర్ కాలనీ- బి.హిల్స్ హైదరాబాద్ లో తెలుగు ఫిలిం అండ్ టీవీ కాస్టింగ్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ (Reg :1195/2021) ఆఫీస్ లో  వివ‌రాల‌కు సంప్రదించాలని ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News