టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలు నా గురించి అలా అనుకుంటున్నారేమో!
కోలీవుడ్ లో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఐశ్వర్యా, గ్లామర్ రోల్స్ కు కాకుండా ఎక్కువగా క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లారు.;
గ్లామర్ కంటే యాక్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. కోలీవుడ్ లో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఐశ్వర్యా, గ్లామర్ రోల్స్ కు కాకుండా ఎక్కువగా క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లారు. తన నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించగల ఐశ్వర్యా రాజేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తనదైన ముద్ర వేశారు.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఐశ్వర్యా
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రశంసల్ని అందుకున్న ఐశ్వర్యా రాజేష్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటించి మెప్పించారు. తర్వాత నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్
తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినా అవేవీ చెప్పుకోదగ్గ సక్సెస్ అవకపోవడంతో ఐశ్వర్యాకు స్టార్ స్టేటస్ దక్కలేదు. అయినప్పటికీ ఐశ్వర్య తన ప్రయత్నాన్ని ఆపకుండా మంచి కథలను ఎంచుకుని, సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. అయితే గతేడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఐశ్వర్యకు కోరుకున్న సక్సెస్ ను అందించింది.
భాగ్యం పాత్రకు విమర్శకుల ప్రశంసలు
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ వెంకటేష్ భార్య భాగ్యం పాత్రలో నటించి అందరినీ బాగా ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో ఐశ్వర్య నటించిన తీరు ఎంతో సహజంగా ఉండటంతో పాటూ వెంకటేష్ పక్కన జోడీగా కూడా బాగా కుదరడంతో అమ్మడికి మంచి మార్కులు పడటంతో పాటూ ఈ మూవీలో తన యాక్టింగ్ కు ఐశ్వర్య విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకున్నారు.
సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడంతో ఇకపై ఐశ్వర్యకు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలొస్తాయని అందరూ అనుకున్నారు. అందరితో పాటూ ఐశ్వర్య కూడా అలానే అనుకున్నారట. కానీ ఆమెకు అంత పెద్ద సక్సెస్ తర్వాత కూడా భారీ ఆఫర్లు రాకపోవడంపై ఐశ్వర్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా తనకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాలేదని, ఆ సినిమా హిట్ తర్వాత మంచి ఛాన్సులొస్తాయనుకున్నానని, కానీ హీరోయిన్ గా ఐశ్వర్య చేయగలదా అనే డౌట్ తెలుగు డైరెక్టర్లు, హీరోల్లో ఉందేమో అని ఐశ్వర్యా అభిప్రాయపడ్డారు. అయినా, తనకు వచ్చిన అవకాశాలతో తాను సంతోషంగానే ఉన్నానని, 21 ఏళ్ల వయసులోనే తాను ఇద్దరు పిల్లల తల్లిగా నటించానని, కాకా ముట్టై లో తాను చేసిన పాత్ర తనకు చాలా ధైర్యాన్నిచ్చిందని ఆమె చెప్పారు.