#బార్డర్ 2.. 'దురంధర్'ని టచ్ చేయడం అసాధ్యం
బాలీవుడ్ మీడియా ఒక్కోసారి ఊదరగొట్టేస్తుంటుంది. ముఖ్యంగా ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమా డామినేషన్ ని హిందీ మీడియా తట్టుకోలేకపోతోంది.;
బాలీవుడ్ మీడియా ఒక్కోసారి ఊదరగొట్టేస్తుంటుంది. ముఖ్యంగా ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమా డామినేషన్ ని హిందీ మీడియా తట్టుకోలేకపోతోంది. పర్యవసానంగా బాలీవుడ్ రైజింగ్ ని చూడాలని కసిగా వేచి చూస్తోంది. కరోనా క్రైసిస్ తర్వాత ఉత్తరాదిన దక్షిణాది సినిమా హవా కొనసాగడం... హిందీ పరిశ్రమ డిజాస్టర్లతో నీరసపడిపోవడంతో ఇంతకాలం వేచి చూసింది. షారూఖ్ పఠాన్- జవాన్ కొంతవరకూ ఊరట. స్త్రీ 2, చావా లాంటి సినిమాలు ఆదుకున్నాయి. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ `దురంధర్` హిందీ పరిశ్రమ గౌరవాన్ని కాపాడింది. `దురంధర్` చిత్రం 50రోజుల్లో 800కోట్ల నెట్... వసూళ్లను సాధించడం నిజంగా ఒక రికార్డ్. అయితే దురంధర్ వసూళ్ల విషయంలో కొన్ని హిందీ మీడియాలు చాలా హైప్ క్రేయేట్ చేయడానికి ప్రయత్నించాయన్నది వాస్తవం. ఒరిజినల్ లెక్కలకు మీడియా చూపించిన లెక్కలకు కచ్ఛితంగా తేడా ఉంది. అయినా దురంధర్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కిందనడంలో సందేహం లేదు.
అయితే ఇప్పుడు సన్నీడియోల్ లాంటి సీనియర్ హీరో నటించిన బార్డర్ 2 చిత్రం విషయంలోను బాలీవుడ్ మీడియా అత్యుత్సాహం చూస్తుంటే ఇది చాలా కామెడీగా అనిపిస్తోంది. బార్డర్ 2 చిత్రం 6 రోజుల్లో 213 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే బార్డర్ 2 దురంధర్ రికార్డులను కొట్టేస్తుంది! అంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి బార్డర్ 2 కి అంత సీన్ లేదని కొందరు క్రిటిక్స్ విశ్లేషించారు.
బార్డర్ 2 చిత్రం 50 రోజులు ఆడినా 800కోట్లు తేవడం కష్టం.. ఇప్పటికి బాగా ఆడుతున్నా కానీ, దురంధర్ రన్ వేరే.. దురంధర్ చిత్రానికి సంక్రాంతి సెలవులు బాగా కలిసొచ్చాయి... సౌత్ లో కూడా బాగా ఆడింది.. ఆ పరిస్థితి సన్నీడియోల్ బార్డర్2 చిత్రానికి లేదు. దురంధర్ ఒరిజినల్ కథతో.. బయోపిక్ కేటగిరీలో వచ్చిన సినిమా కాబట్టి అన్ స్టాపబుల్ గా దూసుకెళ్లింది.. కానీ బార్డర్ 2 సీక్వెల్ సినిమా... ఇప్పటికే చూసేసిన ఎమోషన్స్ రొటీన్ వార్ డ్రామా కాబట్టి దీనికి అంత సీన్ లేదని విశ్లేషిస్తున్నారు.
నిజానికి బార్డర్ 2 చిత్రానికి పండగ సెలవులు ఏవీ కలిసి రాలేదు. కేవలం వీకెండ్స్ పై మాత్రమే ఆధారపడి ఫుల్ రన్ ని సాగించాల్సి ఉంటుంది. అందువల్ల దురంధర్ రేంజులో వసూలు చేయడం సాధ్యపడదు. అలాగే బార్డర్ 2 కి రెండో వారంలో అసలైన టెస్ట్ మొదలవుతుంది. ఇంకా నాలుగైదు వారాలు భారీగా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ దేశభక్తి సినిమా దురంధర్ స్థాయికి వెళుతుందని ట్రేడ్ భావించడం లేదు. అయితే బార్డర్ 2 సన్నీడియోల్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో నటించిన వరుణ్ ధావన్, అహాన్ శెట్టి లాంటి యువహీరోలకు ఒక మంచి హిట్టు దక్కినట్టయింది. ఇకపై యంగ్ హీరోలు సోలో హిట్లతో నిరూపించాల్సి ఉంటుంది.