8 ఏళ్లుగా పెండింగ్.. టాలీవుడ్‌కి నంది అవార్డులు ఎప్పుడు?
వినోద పరిశ్రమలపై ప్రభుత్వాలకు ఉండే శ్రద్ధ ఎప్పుడూ నిల్. ఇతర రంగాలతో పోలిస్తే దీనిపై గురి అంతగా ఉండదు.;
వినోద పరిశ్రమలపై ప్రభుత్వాలకు ఉండే శ్రద్ధ ఎప్పుడూ నిల్. ఇతర రంగాలతో పోలిస్తే దీనిపై గురి అంతగా ఉండదు. ముఖ్యంగా కళారంగానికి రాజకీయ రంగు అద్దితే, ఇక అక్కడ అభివృద్ధి అనేది జీరోగా మారుతుంది. అలాంటి డైలమా సన్నివేశంలోనే ఉన్నాయి చాలా పరిశ్రమలు. వినోద పరిశ్రమను నిజానికి ఆకులా వక్కలా చూసే వాళ్లు ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకోవడానికి గ్లామర్ కావాలి. హీరోలు, హీరోయిన్లతో పబ్లిసిటీలు చేయించుకోవడానికి సినీరంగంతో పని ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ వెళితే.. కూరలో కరివేపాకు వ్యవహారం చాలా ఉంది. టాలీవుడ్ సంగతి అటుంచితే కోలీవుడ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ సినిమాలు- రాజకీయాలు మమేకమై ఉంటాయన్నది తెలిసిందే. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం ఇవ్వాల్సిన పురస్కారాలు కొన్నేళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి. అసలు కళాకారులకు ప్రభుత్వం తరపున గుర్తింపు, గౌరవం అన్నదే లేకుండా పోయింది.
తాజాగా కోలీవుడ్ లో ఏడేళ్ల అవార్డులు ఒకేసారి ఇచ్చి స్టాలిన్ ప్రభుత్వం ఆశ్చర్యపరిచింది. వరుసగా ఏడేళ్లకు ఏడు ఉత్తమ సినిమాలు, ఏడుగురు ఉత్తమ హీరోలు, ఏడుగురు ఉత్తమ హీరోయిన్లు, ఉత్తమ దర్శకులను ఎంపిక చేయడమే గాక పలువురు ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రకటించడంతో ఒకటే ఉత్సాహం నెలకొంది. కనీసం ఇప్పటికి అయినా కళారంగాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషం! అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే కోలీవుడ్ లోనే ఈ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను ప్రభుత్వ పురస్కారాల ఆలస్యం ఎప్పుడూ చర్చగానే ఉంది. కొన్నేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులతో ప్రభుత్వ పురస్కారాలను రీస్టార్ట్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ డివైడ్ తర్వాత ఒక రకమైన పరిస్థితి దీనికి కారణం.
ఆంధ్రప్రదేశ్ లో టాలీవుడ్ కి నంది అవార్డులను చివరిసారిగా ఎప్పుడు ఇచ్చా.రో గుర్తు చేసుకుంటే.. 2017లో సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రకటించారు. అయితే 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ఒకేసారి ఉమ్మడిగా అందజేసారు. ఇప్పుడు 2018 నుంచి 2025 వరకూ 8ఏళ్ల అవార్డులు పెండింగ్ లో ఉన్నాయి... గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు.. కనీసం కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా? అంటే ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.
కనీసం పొరుగు రాష్ట్రం తమిళనాడు (కోలీవుడ్) ఏడేళ్ల అవార్డులను ఒకేసారి ప్రకటించి తమ కళాకారులను గౌరవించుకోవడం చూశాక అయినా తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ అవార్డులను అందించాలని ఒత్తిడి పెరుగుతోంది.
ఏపీలో 2017 (ఉమ్మడి అవార్డుల ప్రకటన) తర్వాత నంది అవార్డుల ఊసే లేకుండా పోయింది. ఎనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి. అయితే రాజకీయంగా మార్పులు, కోవిడ్-19 ప్రభావం, గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పట్ల చూపిన ఉదాసీనత దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు తమిళనాడు లో డిఎంకే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 2016-2022 అవార్డులను ఒకేసారి ఇచ్చి కళారంగానికి గౌరవం ఇచ్చింది. కళాకారులకు లక్షల్లో బహుమతులు కూడా ప్రకటించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు కాల్ అని కూడా భావించాలి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసి, నంది అవార్డుల స్థానంలో `గద్దర్ అవార్డుల`ను ప్రకటించింది. జూలై 2024లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. దీనివల్ల తెలంగాణలో అవార్డుల ప్రక్రియ పట్టాలెక్కింది. ఏపీలో కూటమి ప్రభుత్వం సినీపరిశ్రమకు అనుకూలంగానే ఉన్నా రాజధాని నిర్మాణం బిజీలో ఇక దేనినీ పట్టించుకునే పరిస్థితి లో లేదు. కోలీవుడ్ లాగే ఏపీ ప్రభుత్వం కూడా 2017 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులను ఒకేసారి ప్రకటిస్తుందా? అన్నది వేచి చూడాలి. గత ఏడాది చివరిలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల నంది జూరీని ప్రకటిస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.
అవార్డు అనేది కేవలం ఒక జ్ఞాపిక మాత్రమే కాదు, అది ఒక కళాకారుడి కష్టానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం. కోలీవుడ్ మాదిరిగా తెలుగు కళాకారులకు కూడా గుర్తింపు కోసం ప్రభుత్వాలు పురస్కారాలను వెంటనే ఇవ్వాలని కోరుకుందాం.