ఓవర్ సీస్ మార్కెట్ పై మళ్ళీ దెబ్బపడనుందా..?

Update: 2022-01-03 13:30 GMT
తెలుగు సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి వచ్చి దీనిపై దెబ్బేసింది. ఒకప్పుడు మిలియన్ల డాలర్లు ఉంటే మార్కెట్ కాస్తా కిందికి పడిపోయింది. కాకపోతే ఫస్ట్ వేవ్ తర్వాత 'జాతిరత్నాలు' యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. సెకండ్ వేవ్ పాండమిక్ అనంతరం 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి చిత్రాలు ఓవర్ సీస్ బిజినెస్ కి ఊపిరిపోశాయి.

ఈ క్రమంలో వచ్చిన 'అఖండ' సినిమా యూఎస్ లో 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే క్రిస్మస్ సందర్భంగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలు కూడా ఓవర్ సీస్ లో బాగానే వసూలు చేసాయి. అయితే మరికొన్ని రోజుల్లో బబ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం సమస్యగా మారిందని తెలుస్తోంది.

నిజానికి అల్లు అర్జున్ - నాని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కరోనా ఇబ్బందిలేదు. కానీ గత కొన్ని రోజులుగా ప్రపంచమంతటా కోవిడ్ కేసులు పెరగడం వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. థియేటర్లలో విధించిన ఆంక్షలు సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. యూఎస్ లో 'పుష్ప' పార్ట్-1 ఇప్పటి వరకు 2.35 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. 'శ్యామ్ సింగరాయ్' 750K డాలర్లకు పైగా రాబట్టింది.

శుక్రవారం విడుదలైన 'అర్జున ఫల్గుణ' సినిమా ఇప్పటి వరకు 30K డాలర్లు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు యూఎస్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ వారం మూడు తెలుగు సినిమాల కలెక్షన్స్ పరిశీలిస్తే వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ మీద పడుతోందని అర్థం అవుతోంది. వరల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే తెలుగు నిర్మాతలు నిర్మించిన హిందీ 'జెర్సీ' - 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలను వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతానికైతే సంక్రాంతి బరిలో 'రాధేశ్యామ్' 'బంగార్రాజు' లతో పాటుగా మరో అర డజను చిన్న సినిమాలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైరస్ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓవర్ సీస్ మార్కెట్ ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News