విశ్వరూపం-2.. అప్పుడే సెన్సారా?

Update: 2018-03-17 08:39 GMT
చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ‘విశ్వరూపం’ విడుదలైన ఏడాదికే ‘విశ్వరూపం-2’ రావాల్సింది. కానీ సినిమా 2014కే రెడీ అయినప్పటికీ భారీ ఖర్చుతో కూడుకుున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం జరగడంతో సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. మూడేళ్ల పాటు అసలు ఈ చిత్రం చర్చల్లోనే లేదు. దానికి సంబంధించి ఏ పనీ నడవలేదు. కానీ గత ఏడాది కమల్ హాసన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి సినిమాను తీసుకుని తన నిర్మాణ సంస్థలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. సినిమా ఈ మధ్యే రెడీ అయిపోయింది. ఫస్ట్ కాపీ కూడా తీసేశారు. అప్పుడే తమిళంలో ఈ చిత్రానికి సెన్సార్ కూడా అయిపోయిందంటూ తమిళ మీడియా రిపోర్ట్ చేసింది. యు-ఎ సర్టిఫికెట్ ఇచ్చారట సెన్సార్ వాళ్లు.

‘విశ్వరూపం’ విడదులకు ముందు కమల్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలిసిందే. సెన్సార్ దగ్గర చాలా సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విడుదలకు చాలా ముందే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడట కమల్. ఐతే అప్పుడైతే జయలలిత ఉంది కాబట్టి కమల్‌ను ఇబ్బంది పెట్టింది కానీ.. ఇప్పటి ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లే పరిస్థితి లేదు. కమల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు సెన్సార్ అడ్డంకులు సృష్టిస్తే పెద్ద రగడకు దారి తీయడం ఖాయం. అది ఆయనకు పెద్ద అడ్వాంటేజీ అవుతుంది. అందుకే తమిళ ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లుగా కనిపించడం లేదు. అన్నీ కుదిరితే తమిళ నూతన సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 13న ‘విశ్వరూపం-2’ను రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నాడు.
Tags:    

Similar News