ఆయనకిది మొదటిసారి కాదు ఆఖరు కాదు

Update: 2019-03-26 17:16 GMT
స్టార్ హీరోయిన్ నయనతారపై సీనియర్ తమిళ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదం రోజురోజుకీ పెద్దదవుతోంది.  ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు.  డీఎంకే పార్టీ నుండి రాధారవిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.

బాలీవుడ్ నటి 'షకీలా' చిత్రంలో నటిస్తున్న రిచా చద్దా ఈ విషయంపై స్పందిస్తూ డీఎంకే పార్టీ నిర్ణయాన్ని ప్రశంసించారు. "మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారెవరినీ క్షమించకూడదు. అసభ్యకరమైన ప్రవర్తనకు.. కించపరిచే మాటలకు ఆధునిక సమాజంలో చోటు లేదు"అంటూ గట్టిగా తన అభిప్రాయాన్ని వినిపించింది.  ఖుష్బూ మాట్లాడుతూ "రాధా రవి వ్యాఖ్యలు దారుణమైనవి. అతని కామెంట్స్ తో నేను షాక్ అయ్యాను. మగవాళ్ళకు మాట్లాడటం చేతకానప్పుడు ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే పనికి తెగబడతారు" అంటూ విమర్శించింది.

ఇక తమిళ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు.. హీరో విశాల్ మాట్లాడుతూ "ఆయనకు ఇలా మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడడం కొత్త కాదు. ఇదేమీ మొదటిసారి కాదు. ఒకవేళ ఆయనపై మనం కఠిన చర్య తీసుకోకుంటే ఇది చివరిసారి కూడా కాబోదు" అన్నాడు.  అంతే కాదు రాధారవి కామెంట్లకు నవ్వుతూ చప్పట్లు కొట్టినవారి ప్రవర్తనను కూడా అందరూ ఖండించాలని అభిప్రాయపడ్డాడు. 

ఈ వివాదంపై సీనియర్ నటి రాధిక.. రానా దగ్గుబాటి.. సమంతా కూడా స్పందించి నయనతారకు తమ మద్దతు తెలుపుతూ రాధారవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Tags:    

Similar News