'#PSPKRana' సినిమా కోసం త్రివిక్రమ్ కీలక సూచనలు..?

Update: 2021-07-10 15:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు.

అనుకోని పరిస్థితుల్లో కలిసిన ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ - రిటైర్ట్ హవల్దార్‌ జీవితాల్లో.. వారి మధ్య ఈగోల కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ వెర్షన్ లో ఈ సీరియస్ డ్రామాలో సాంగ్స్ పెద్దగా ఉండవు. ఎక్కువ భాగం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే నడిపించారు.

అయితే తెలుగులో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు కాబట్టి అభిమానులు పాటలు ఎక్సపెక్ట్ చేస్తారు. ఇప్పటికే త్రివిక్రమ్ మన నేటివిటికీ తగ్గట్టుగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసాడు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ని కూడా కలిపారు. కానీ అదనంగా సాంగ్స్ మాత్రం వద్దని త్రివిక్రమ్ దర్శక నిర్మాతలకు సూచించారట.

ఇద్దరు సమవుజ్జీవులు తమ బలాలను చూపించుకునే సీరియస్ డ్రామాలో కొత్తగా పాటలు పెడితే.. సినిమా ప్రభావాన్ని నీరుగార్చే అవకాశం ఉందని త్రివిక్రమ్ సలహా ఇచ్చారట. అందుకే '#PSPKRana' చిత్రంలో గరిష్టంగా రెండు లేదా మూడు పాటలు మాత్రమే ఉంటాయని.. అవి కూడా కథలో భాగంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అలానే నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత ఇస్తున్నారట.

ఇందులో పవన్ ఓ ఫోక్ సాంగ్ ను అలపించనున్నారు. దీని కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మంచి ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే మలయాళంలో బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్‌ పాత్రలో రానా కనిపించనున్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఏకే' రీమేక్.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయింది. జూలై 12న ఈ సినిమాని తిరిగి ప్రారంభించనున్నారు.
Tags:    

Similar News