ఖాన్ ల‌ను కొట్టేలా మ‌నోళ్లు ఎదిగేస్తున్నారా?

Update: 2021-12-28 05:33 GMT
ఓవైపు ఖాన్ ల శ‌కం ముగుస్తోంది. 50 ప్ల‌స్ ఏజ్ తో ఖాన్ ల త్ర‌యం ఇప్ప‌టికే డీలా ప‌డిపోతున్న సంగ‌తి తెలిసిందే. షారూక్ ఖాన్ కి ఊహించ‌ని విధంగా వ‌రుస ఫ్లాపులు ఓవైపు.. ఇత‌ర వివాదాలు మ‌రోవైపు ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. ఇక అమీర్ ఖాన్ రెండు మూడేళ్ల‌కు ఒక సినిమా చేస్తూ అత‌డు రేసులోనే లేడు. ఆ ముగ్గురిలో స‌ల్మాన్ ఖాన్ మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ ఉన్నా అత‌డి ఏజ్ కూడా ఎక్కువే ఉంది.

స‌ల్మాన్ వ‌య‌సు 56. ఈరోజుతో 57.. ష‌ష్ఠిపూర్తి చేసుకోవ‌డానికి మూడేళ్లు మాత్ర‌మే డెడ్ లైన్. మ‌రోవైపు ఇదే వ‌య‌సులో ఉన్నాడు షారూక్ కూడా. అత‌డి ఏజ్ 56. ఇక అమీర్ ఖాన్ ఏజ్ కూడా 56. ఆ ముగ్గురికి షష్ఠి పూర్తి ఏజ్ వ‌చ్చేస్తోంది. నిజానికి షష్ఠిపూర్తి జ‌రుపుకునే ధైర్యం వారికి ఉందా లేదా? అన్న‌ది అటుంచితే.. వార్ లోకి యువ‌హీరోలు దూసుకొచ్చేశారు.

ఇప్పుడున్న టాప్ హీరోల్లో ర‌ణబీర్ చాలా స్లోగా ఉన్నాడు. ఇక అక్ష‌య్ కుమార్ సైతం స‌క్సెస్ ఎంత వున్నా వ‌య‌సు బ‌య‌ట‌ప‌డిపోతోంది. అత‌డి ఏజ్ 54. మ‌హా అయితే ఆరేళ్లు ఇండ‌స్ట్రీని ఏల్తాడేమో! విక్కీ కౌశ‌ల్.. వ‌రుణ్ ధావ‌న్.. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలే నిరూపించాలి. బాలీవుడ్ లో మిడ్ రేంజు హీరోలు మాత్రం త‌మ స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటున్నారు.

అయితే ఖాన్ లు కిలాడీలు క‌పూర్ ల‌ను కొట్టేలా టాలీవుడ్ నుంచి డార్లింగ్ ప్ర‌భాస్ దూసుకెళుతున్నాడు. బాహుబ‌లి ఫ్రాంఛైజీతో స‌త్తా చాటి.. సాహోతో నిరూపించాడు. ఇప్పుడు వ‌రుస‌గా నాలుగు పాన్ ఇండియా చిత్రాల‌తో బాలీవుడ్ స్టార్ హీరోల‌కు ధీటుగా నువ్వా నేనా? అంటూ ఢీకొడుతున్నాడు. ప్ర‌భాస్ ఏజ్ 42లోనే ఉంది కాబ‌ట్టి అత‌డికి ఇంకా 15ఏళ్లు పైగానే లాంగ్ డ్రైవ్ కుదురుతుంది. ఈ ప‌దిహేనేళ్ల‌లో హిందీ మార్కెట్లో కింగ్ అని నిరూపిస్తాడ‌ని భావిస్తున్నారు.

ఇది ఒక‌ర‌కంగా ఖాన్ ల‌కు స‌వాల్ లాంటిదే. మ‌రోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ‌బ్బింగ్ చిత్రాల‌తో హిందీ మార్కెట్లో పాగా వేసి నెమ్మ‌దిగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఇప్పుడు పుష్ప చిత్రంతో రేసులోకి వ‌చ్చేశాడు. పుష్ప ది రైజ్ తో మ‌రో మెట్టు ఎక్కాడు. ఈ సినిమా ఒమిక్రాన్ భ‌యాలున్నా కానీ హిందీలో 50కోట్ల క్ల‌బ్ ని అధిగ‌మిస్తుంద‌ని అంచ‌నా. పుష్ప -2తో సీన్ మొత్తం ఒక్క‌సారిగా మార్చేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా ఏర్ప‌డింది.

మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో బాలీవుడ్ లోకి రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీ రామారావు దూసుకెళుతున్నారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆ ఇద్ద‌రినీ హిందీలో అగ్ర హీరోల‌ను చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కూడా బాహుబ‌లి రేంజులో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌య‌సు 38.. రామ్ చ‌ర‌ణ్ వ‌య‌సు 36. అంటే ఆ ఇద్ద‌రికి ఇంకో 15-20 ఏళ్లు డోఖా లేదు. స్టార్ హీరోలుగా త‌మ స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటూ పాన్ ఇండియా వేట‌లో నిమ‌గ్న‌మై ఉంటారు. అంటే ప్ర‌భాస్ త‌ర్వాత బ‌న్ని-చ‌ర‌ణ్‌- తార‌క్ క్యూ హిందీ అగ్ర హీరోల‌కు స‌వాల్ విసిరే రేంజుకు ఎదిగే ఛాన్సుంటుంద‌న్న‌మాట‌. అయితే అక్క‌డ యువ‌హీరోల‌తో పోటీప‌డుతూ మ‌న తెలుగు హీరోలు హిందీలో మార్కెట్ ని ఢీకొట్టాల్సి ఉంటుంది. మ‌రి ఇదంతా సాలిడ్ గేమ్ లా మారుతుంద‌నే ఆకాంక్షిద్దాం.

ఇటీవ‌ల హిందీ తో పోలిస్తే బ‌డ్జెట్ల అంత‌రం త‌గ్గిపోతోంది. పైగా తెలుగు కి మార్కెట్ హిందీలో అమాంతం పెరిగింది. భాష‌ల మ‌ధ్య స‌రిహ‌ద్దులు అన్న‌వే చెరిగిపోతున్నాయి. హిందీ హీరోల‌కు ఇరుగు పొరుగు ఆలోచ‌న త‌క్కువ‌. కానీ మ‌న హీరోలకు అన్ని మార్కెట్లు కావాలి. ఇది తెలుగు హీరోల‌కు ప్లస్ గా మారింది. మునుముందు తెలుగులో సై-ఫై సినిమాలు ఫిక్ష‌న్ సినిమాల‌కు గిరాకీ పెరుగుతోంది. మేకింగ్ విలువ‌లు హాలీవుడ్ ని ట‌చ్ చేస్తుంటే అటు జియాంట్ బ్యాన‌ర్లు మ‌న‌వైపు చూస్తున్నాయి. ఇదంతా మారుతున్న ట్రెండ్ టాలీవుడ్ కి పెద్ద స్పాన్ ని చూపిస్తోంద‌నే విశ్లేషించాలి.



Tags:    

Similar News