ట్రెండీ టాక్: దర్శకసంఘంలోనూ చీలిక!?
సినిమాలతో నిరంతరం బిజీగా ఉండే వాళ్లు వేరు. అసలు ఏ సినిమాలు చేయకుండా కేవలం హోదా కోసం కొనసాగే వాళ్లు వేరే. సంఘంలో ఇన్సూరెన్సులు.. ఇళ్ల స్కీమ్ లు వగైరా అనుభవించేందుకు మాత్రమే ఈ రెండో కేటగిరీ జనం పుట్టుకొస్తారు. వీళ్లు ఎప్పటికీ సినిమాలు తీయరు. జమానా కాలంలో తీసిన ఒకట్రెండు సినిమాల్నే ప్రతిసారీ చెప్పుకుంటారు. లేదా సినిమాని ప్రారంభించామని హడావుడి చేసి ఎప్పటికీ దానిని రిలీజ్ చేయరు. అంటే ఆ ప్రాజెక్ట్ గాల్లోనే ఉండి ఎప్పటికీ రిలీజవ్వదు అన్నమాట. ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఏళ్లకు ఏళ్లు ఇన్సూరెన్సులు అనుభవించేవాళ్లు.. ఇండ్ల స్కీములు అనుభవించే వాళ్లు చాలామందే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక పరిశ్రమలో ఇప్పటికే నిర్మాతల మండలిలో చీలిక రావడానికి ఇలాంటి కారణమే బయటపడింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో 2000 మంది నిర్మాతలు ఉంటే అందులో సినిమాలు తీసేవాళ్లు 50 మంది కూడా ఉండరు. పూర్తి యాక్టివ్ గా సినిమాలు తీసే వాళ్లు 20 మంది మించరని అంచనా. అందుకే ఆ 10 మంది లేదా 20 మంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ సొంత కుంపటి పెట్టుకుని ఇతరుల్ని అవాయిడ్ చేశారు. ప్రస్తుతం నిర్మాతల మండలి నామమాత్రంగానే ఉందన్న సెటైర్లు పడుతూనే ఉన్నాయి. మండలిలో ఎన్ని రాజకీయాలు చేసినా సినిమాలు తీసేవాళ్లు లేరన్న ఆరోపణలున్నాయి.
దిల్ రాజు సారథ్యంలోని యాక్టివ్ గిల్డ్ లో డి.సురేష్ బాబు- అల్లు అరవింద్ - బూరుగుపల్లి- స్రవంతి రవికిషోర్ సహా పలువురు ఉన్నారు. ప్రస్తుతం పరిశ్రమను నడిపిస్తున్నది ఈ యాక్టివ్ గిల్డ్ మాత్రమే. పరిశ్రమకు సంబంధించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదా సమస్యల్ని పరిష్కరించుకోవడంలో వీరు యాక్టివ్ గా ఉన్నారు. రిలీజ్ తేదీల సమస్య వచ్చినప్పుడు పరిష్కరించారు. పత్రికలు మీడియాలకు ప్రకటనలు ఏ బేసిస్ లో ఇవ్వాలో నిర్ణయించేది వీళ్లే. ఇంకా చాలా వ్యవహారాల్లో వీరి వ్యాపకాలు ఉంటాయి.
అందుకే వీటన్నిటి స్ఫూర్తితో దర్శకసంఘంలోనూ చీలిక వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకసంఘానికి ఎన్.శంకర్ అధ్యక్షునిగా ఉన్నారు. అయితే ఈ సంఘంలో సినిమాలు తీయని దర్శకుల హవా కనిపించడంపై యాక్టివ్ డైరెక్టర్స్ గుర్రుగా ఉన్నారట. రాజమౌళి- కొరటాల శివ- త్రివిక్రమ్- సుకుమార్ సహా మరో 20 మంది మాత్రమే రెగ్యులర్ గా సినిమాలు తీయగలిగేది. ఇతరులంతా నామ మాత్రమే. కొందరికి ఎప్పటికీ అవకాశాలు రాని వాళ్లు దర్శకసంఘంలో పోగుపడి సంక్షేమ పథకాల్ని అనుభవిస్తున్నారట. పైగా నిర్ణయాల్లో వేలు పెడుతూ రాజకీయాలు చేస్తుండడంతో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు యాక్టివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ని ఫామ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇక ఇటీవలి కాలంలో యాక్టివ్ గా ఉండే కొందరు దర్శకులు సపరేట్ గా సమావేశాలు పెట్టుకోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవరికీ తెలీకుండానే ఈ సమావేశాలు జరుగుతుండడంపై సర్వత్రా ఆసక్తికరంగానే మాట్లాడుకుంటున్నారు. నిర్మాతల మండలిని వదిలేయకుండానే యాక్టివ్ నిర్మాతల గిల్డ్ లో కొనసాగినట్టు ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ లో కొనసాగుతూనే యాక్టివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లోనూ కొనసాగుతారట. దర్శకుల్లో చీలిక ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండీ టాపిక్.