పబ్లిక్ ఒపీనియన్: బాలీవుడ్ లో సత్తా చాటగలిగే టాలీవుడ్ హీరో..?

Update: 2021-06-23 01:30 GMT
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు మార్కెట్ విస్తరించుకునే పనిలో ఉన్నారు. కొందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మరికొందరు పాన్ సౌత్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. క్రేజ్ - ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో మల్టీలాంగ్వేజ్ లలో తమ సినిమాలను విడుదల చేయాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోలకు పోటీగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సత్తా చాటగలిగే టాలీవుడ్ హీరో ఎవరనే దానిపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ లు ఉంచబడిన ఈ పోల్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం!

'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇందులో ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపి టాప్ లో నిలిపారు. 'సాహో' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ కు 36.70% ఓట్లు లభించాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని కాపాడుకునే సత్తా ఉన్న హీరో ప్రభాస్ అని ప్రేక్షకులు నమ్ముతున్నారని అర్థం అవుతోంది. 'ఆదిపురుష్' అనే స్ట్రెయిట్ హిందీ సినిమా చేస్తున్న ప్రభాస్.. 'రాధే శ్యామ్' 'సలార్' వంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పోల్ లో 15.55% మంది సపోర్ట్ తో రెండో స్థానంలో నిలిచాడు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశాడు తారక్. ఈ మూవీ రిలీజ్ అవకుండానే బాలీవుడ్ లో హవా చూపించగలడని ఆడియన్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హిందీ పరిశ్రమలో నెగ్గుకురాగలుగుతాడని 12.90% మంది నమ్ముతున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన VD.. యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విజయ్.. 'లైగర్' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో భారీ స్కేల్ లో ఓ సినిమా చేయనున్నాడు.  

'జంజీర్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఈ పోల్ లో 11.66% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న చరణ్.. ఈసారి హిందీ ఇండస్ట్రీకి తన సత్తా చూపిస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఇకపై చెర్రీ చేయబోయే సినిమాలన్నీ మల్టీలాంగ్వేజ్ లలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాలీవుడ్ లో సత్తా చాటే స్టామినా ఉందని 11.08% మంది విశ్వసిస్తున్నారు. ఇప్పటి పాన్ ఇండియా ఇండియా ప్రాజెక్ట్ చేయని మహేష్ కు ఇంతమంది మద్దతు ఉండటం గమనార్హం. ఎప్పటి నుంచో మహేష్ ని హిందీ సినిమా చేయమని అభిమానులు కోరుతున్నారు. రాజమౌళి తో చేయబోయే సినిమాతో ఆ దిశగా అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న మహేష్.. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు.

'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న అల్లు అర్జున్ కు ఇందులో 7.28% ఓట్లు వచ్చాయి. బాలీవుడ్ లో ఫస్ట్ స్టెప్ చాలా గట్టిగా వేయాలని ఫిక్స్ అయిన బన్నీ.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాడు. 'ఐకాన్' ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టిన బన్నీ.. ఈ క్రమంలో బోయపాటి శ్రీను - మురగదాస్ - కొరటాల శివ - ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి దెబ్బతిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 4.82% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
Tags:    

Similar News