టికెట్ రేట్లు ఇంకా తగ్గించాల్సిందే..!

Update: 2022-06-25 09:30 GMT
టాలీవుడ్ లో ఇటీవల కాలంలో టికెట్ రేట్ల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు అధిక రేట్లు లాభదాయకంగా మారితే.. మిగతా చిత్రాలకు అవి శాపంగా మారాయి. ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. ఎక్కువ ధరలు పెట్టి సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరచడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన మేకర్స్ రేట్లు తగ్గించి రిలీజులు చేస్తున్నారు.

'మేజర్' విడుదల సమయంలో హీరో అడివి శేష్ చొరవతో డిస్ట్రిబ్యూటర్స్ తక్కువ ధరలతో సినిమాను ప్రదర్శించారు. అప్పటి నుండి అన్ని మీడియం రేంజ్ చిత్రాలకు హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 మరియు మల్టీప్లెక్స్‌ లలో రూ. 200 టికెట్ ధరలు నిర్ణయించబడ్డాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ లో అర డజనుకు పైగా చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ స్క్రీన్ మీదకు వచ్చేశాయి.

ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన '7 డేస్ 6 నైట్స్' - రామ్ గోపాల్ వర్మ 'కొండా' - కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' - పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి 'చోర్ బజార్' వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇవి కాకుండా 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' 'సదా నన్ను నడిపే' 'కరణ్ అర్జున్' 'సాఫ్ట్ వేర్ బ్లూస్' వంటి మరో చిన్న చిత్రాలు రిలీజ్ కూడా అయ్యాయి.

ఈ సినిమాల మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ రేట్లు తగ్గించినప్పటికీ.. సాధారణ ప్రేక్షకులకు ఇవి కూడా ఎక్కువగానే అనిపించాయి. ఈ కారణం చేతనే ఏ చిత్రానికీ ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేకపోవడానికి టికెట్ ధరలు కూడా ఒక కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో చిన్న మరియు మీడియం రేంజ్ చిత్రాల టికెట్ ధరలు మరింత తక్కువ ఉంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్‌లకు రూ. 100 మరియు రూ. మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకూ ఉంటే నార్మల్ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే నిర్ణీత ధరల కంటే తక్కువకు సినిమాలను ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూషన్‌ చైన్స్ అంగీకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. జనాలను మరింతగా ఆకర్షించేలా రేట్లు తగ్గించమని నిర్మాతలు అడుగుతున్నా.. డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు మాట వినడం లేదని చెప్పుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News