మహేశ్ వదులుకున్న హిట్ మూవీస్ ఇవే!

Update: 2022-05-13 01:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్ బాబు ఒకరు. హ్యాండ్సమ్ హీరోగా ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. మహేశ్ బాబు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను మాత్రమే వింటారు .. అలాంటి పాత్రలను మాత్రమే చేస్తారు. ఒక కథను ఎక్కువసార్లు వినడం .. దగ్గరుండి రిపేర్లు చేయించడం ఆయనకి అలవాటు లేని పని. ఫస్టు టైమ్ కథ వినగానే ఆయన ఓకే చెబితే చెప్పినట్టు .. లేదంటే లేదు .. అంతే. తనకి నచ్చకపోయినా .. అది తనకి సరిపడని కథే అయినా ఆ విషయం కూడా నాన్చకుండా చెప్పేయడం ఆయన నైజం.

అలా తన బాడీ లాంగ్వేజ్ కి తగని కథలంటూ ఆయన వదిలేసినా సినిమాలు కొన్ని సక్సెస్  అయ్యాయి కూడా. అలాగని చెప్పేసి ఆ విషయాన్ని గురించి బాధపడే తత్వం కూడా కాదు ఆయనది. తన బాడీ లాంగ్వేజ్ కి అది సెట్ కాదని ఊరుకుంటారంతే.

అలా ఆయన వదిలేసిన పెద్ద ప్రాజెక్టులలో 'పుష్ప' ఒకటిగా కనిపిస్తుంది. సుకుమార్ చెప్పిన ఈ కథను మహేశ్ బాబు సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాను చూసినవారెవరైనా ఈ కథ మహేశ్ కి సెట్ కాదనే చెబుతారు.

 ఇక ప్రభాస్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా 'వర్షం' కనిపిస్తుంది. ఈ కథ కూడా ముందుగా మహేశ్ బాబు దగ్గరికే వచ్చింది. అయితే ఆ పాత్ర తనకి అంతగా కనెక్ట్ కాదని మహేశ్ వదిలేశారు. మాస్ యాక్షన్ షేడ్స్ ఎక్కువగా  ఉన్న ప్రభాస్ ఆ పాత్రకి కరెక్ట్ అనే విషయాన్ని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజిని'లో కూడా మహేశ్ చేయవలసింది. కానీ తనని గ్లామర్ గా మాత్రమే చూడటానికి ఇష్టపడే ఫ్యాన్స్ కోసం మహేశ్ ఆ ప్రయోగం చేయడానికి అంగీకరించలేదు.

ఇక ' లీడర్' .. 'ఏ మాయ చేశావే' .. 'అ ఆ' వంటి సినిమాల ఆఫర్లు కూడా ముందుగా మహేశ్ టేబుల్ పైకి వచ్చినవే. అయితే అప్పటి పరిస్థితులను బట్టి  .. తనకి గల ఇమేజ్ ను బట్టి ఆయన ఆ సినిమాలు చేయలేకపోయారు. ఈ జాబితా చూస్తుంటే మాత్రం మహేశ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించకమానదు.

తన సినిమాలకి సంబంధించిన కథల విషయంలో ..  పాత్రల విషయంలో ఆయనకి ఎలాంటి సందేహాలు రాకూడదు. అంత  క్లారిటీతో ఉన్నప్పుడు మాత్రమే ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఆయన తాజా చిత్రంగా 'సర్కారివారి పాట'  ప్రేక్షకుల ముందుకు  రాగా, త్రివిక్రమ్ తోను  .. రాజమౌళితోను తరువాత ప్రాజెక్టులు ఉన్నాయి.
Tags:    

Similar News