ఏపీలో టిక్కెట్టు.. పార్కింగ్ దోపిడీ దారుణం

Update: 2019-06-04 01:30 GMT
తెలంగాణ వ్యాప్తంగా మ‌ల్టీప్లెక్సులు - సింగిల్ థియేట‌ర్ల పార్కింగ్ వ్య‌వ‌హారంలో య‌జ‌మానుల‌ చెవులు మూసేయ‌డంలో తెరాస ప్ర‌భుత్వం విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. పార్కింగ్ పేరుతో గంట‌కి ఇంత అంటూ నిలువుదోపిడీ చేయ‌డంలో ఆరితేరిపోయిన మ‌ల్టీప్లెక్సు యాజ‌మాన్యానికి ఇది అశ‌నిపాతంగా మారింది. ఆ క్ర‌మంలోనే తీవ్ర‌మైన న‌ష్టాలు వ‌చ్చేస్తున్నాయంటూ మ‌ల్టీప్లెక్స్ వోన‌ర్లు దొంగ క‌న్నీరు కార్చి లబోదిబోమ‌న్నారు. అయినా తెరాస ప్ర‌భుత్వం నియ‌మ‌ నిబంధ‌న‌ల్లో ఏమాత్రం స‌డ‌లింపును ఇవ్వ‌లేదు. ఫ‌లితంగా పార్కింగ్ దోపిడీ కుద‌ర‌లేదు. షాపింగ్ లేదా సినిమా ఏదో ఒక‌టి చేసి తిరిగి వెళ్లిపోతూ బిల్ చూపిస్తే చాలు పార్కింగ్ బిల్ క‌ట్ట‌న‌క్క‌ర్లేదు.

అయితే ఏపీలో మాత్రం ఇలాంటి క‌ట్ట‌డి లేద‌ని తెలుస్తోంది. అక్క‌డ య‌థేచ్ఛ‌గానే పార్కింగ్ ఫీజు దోపిడీ సాగుతోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే సినిమా ప్రేక్ష‌కులు.. వినియోగ‌దారులు వాపోతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. సినిమా థియేటర్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని జీవో నెంబర్ 63 ఉన్నప్పటికీ దానిని ఎవ‌రూ ప‌ట్టించుకోకుండా వ‌సూళ్ల‌కు పాల్ప‌డ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇదొక్క‌టే కాదు.. తినుబండారాలను థియేట‌ర్‌ లోనికి తీసుకెళ్లొచ్చు అన్న‌ చట్టం ఉన్నా.. థియేట‌ర్ల‌లో అభ్యంత‌రాలు చెబుతున్నార‌ట‌. వినియోగ‌దారుల చ‌ట్టంలో మార్పు ప్ర‌కారం.. తినుబండారాల్ని థియేట‌ర్ల‌లోకి తీసుకెళ్లే వెసులుబాటు ఉన్నా థియేట‌ర్ గేటువ‌ద్ద‌నే ఆపేస్తున్నార‌ట‌. అదేవిధంగా సినిమా టికెట్ ధరలు ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తే దాని ప్రకారం అమ్మాల్సి ఉండ‌గా ఏపీలో బ్లాక్ టికెటింగ్ విధానం ఇంకా దారుణంగా ఉంది. ఇప్పటికీ ధరలు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అన్ని సినిమా థియేటర్లో లో ఎమ్మార్పీ  ధరలకే తినుబండారాల‌ పట్టికను పెట్టాలని.. అందులో ఉన్న రేటు కు అమ్మాలని సూచించినా చాలాచోట్ల ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ధ‌ర‌ల ప‌ట్టిక‌కు సంబంధించి  యాజమాన్యాలు రాతపూర్వకంగా రాసి ఇవ్వాల‌ని కోర్టు ఇదివ‌ర‌కూ ఆర్డర్ వేసింది. సినిమా హాల్ లో  సమస్యల చిట్టాను థియేటర్ల యాజమాన్యాలు- ప్రభుత్వ అధికారులు రిపోర్ట్ ఇవ్వాల‌ని ఆర్డ‌ర్స్ జారీ అయ్యాయి. మ‌రి ప్ర‌స్తుత స‌న్నివేశంలో మునుముందు మార్పులు వ‌స్తాయేమో చూడాలి. ఇక‌పోతే నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించ‌ని థియేట‌ర్ల‌పైనా.. మ‌ల్టీప్లెక్సుల‌పైనా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఈ అవ్య‌వ‌స్థ ఇలానే కొన‌సాగుతుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక పోతే తెలంగాణ‌లోనూ మ‌ల్టీప్లెక్సుల్లో తినుబండారాల ఖ‌రీదు ఏమాత్రం తగ్గ‌లేదు. సింగిల్ కోక్ - పాప్ కార్న్ కే రూ.500 బిల్లు చెల్లించాల్సిన ధైన్యం చాలా మ‌ల్టీప్లెక్సుల్లో ఉంది. ఇది సామాన్య‌- మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అశ‌నిపాతం అనే చెప్పాలి. దీని ప్ర‌భావం థియేట‌ర్ల‌కు వెళ్లే వారిపై తీవ్రంగానే చూపుతోంది.
Tags:    

Similar News