శివాజీ కామెంట్స్.. ఒక్క ముక్కలో తేల్చేసిన నిధి అగర్వాల్!

'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాయి.;

Update: 2025-12-25 04:31 GMT

'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాయి. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ, చర్చ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా లులు మాల్ లో జరిగిన సంఘటన వల్లే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని, అక్కడ ఒక హీరోయిన్ పడ్డ ఇబ్బంది తనను కలచివేసిందని శివాజీ పదే పదే తన వివరణలో చెప్పుకొచ్చారు. దీంతో అందరి దృష్టి ఆ హీరోయిన్ వైపు మళ్లింది.

ఈ వివాదంపై ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, వంటి వారు చాలా ఘాటుగా స్పందించారు. మహిళా సంఘాలు, ఇండస్ట్రీలోని మహిళా ప్రొఫెషనల్స్ కూడా 'మా' అసోసియేషన్ కు లేఖ రాసే వరకు వెళ్లారు. అయితే శివాజీ తన ప్రసంగంలో ఎవరినైతే ఉదహరించారో, లులు మాల్ ఘటనలో ఇబ్బంది పడ్డ ఆ హీరోయిన్ మాత్రం నిన్నటి వరకు మౌనంగానే ఉన్నారు. ఆమె ఎలా స్పందిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ పై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. శివాజీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, సోషల్ మీడియా వేదికగా ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అయితే ఆమె పెద్ద వీడియోలు రిలీజ్ చేయడం గానీ, పేజీల కొద్దీ లేఖలు రాయడం గానీ చేయలేదు. కేవలం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒకే ఒక్క లైన్ పోస్ట్ చేసి, తన అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా, స్ట్రాంగ్ గా చెప్పారు.

నిధి అగర్వాల్ తన స్టోరీలో "బాధితులను నిందించడం అనేది మానిప్యులేషన్ అనిపించుకుంటుంది" అని రాసుకొచ్చారు. తప్పు జరిగినప్పుడు బాధితుల వస్త్రధారణనో, వారి ప్రవర్తననో తప్పుబట్టడం సరికాదని, అలా చేయడం మానిప్యులేషన్ కిందకే వస్తుందని ఆమె తేల్చి చెప్పారు. తన ఫోటోతో పాటు ఈ కొటేషన్ ని షేర్ చేస్తూ పరోక్షంగా శివాజీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

శివాజీ తన వివరణలో నిధి అగర్వాల్ పడ్డ ఇబ్బంది చూసి తనకు బాధేసిందని, ఆమె సేఫ్టీ కోసమే అలా అన్నానని చెప్పుకొచ్చారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం ఆ వాదనను సమర్ధించడం లేదని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. తన మీద జరిగిన ఘటనకు, తన బట్టలకు లింక్ పెట్టడాన్ని ఆమె తప్పుబడుతున్నట్లుగా ఈ ఒక్క లైన్ ద్వారా అర్థమవుతోంది. బాధితులను కార్నర్ చేయడం కరెక్ట్ కాదని ఆమె స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మరి ఈ కామెంట్స్ పై శివాజీ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News