కన్నీళ్లతో తిహార్ జైలుకు స్టార్ కమెడియన్.. ఒకే ఒక్క సినిమా తలరాత మార్చేసింది!

వెండితెరపై తన కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన నటుడు ఇప్పుడు కన్నీళ్లతో జైలు పాలవ్వడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-02-10 04:02 GMT

వెండితెరపై తన కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన నటుడు ఇప్పుడు కన్నీళ్లతో జైలు పాలవ్వడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్న చిన్న పాత్రలతో మొదలై స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఇప్పుడు ఊహించని మలుపు చోటు చేసుకుంది. నవ్వించడం ఎంత ఈజీయో.. నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడు రారు అనే చేదు నిజాన్ని ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలు గడప తొక్కక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చాలా ఏళ్లుగా సాగుతున్న ఒక కోర్టు కేసులో చుక్కెదురు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. డబ్బు సర్దడానికి మరికొంత సమయం కావాలని కోరినా, న్యాయస్థానం మాత్రం ఈసారి కనికరించలేదు. సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా చట్టం ముందు ఒక్కటే అని చెబుతూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో చేసేదేమీ లేక రాజ్‌పాల్ యాదవ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. 2010లో రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన 'అతా పతా లాపతా' సినిమా కోసం తీసుకున్న అప్పు ఆయన మెడకు చుట్టుకుంది. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆర్థికంగా భారీ దెబ్బ తగిలింది. ఆ సమయంలో తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి కట్టలేకపోయారు. అప్పట్లో ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో మురళీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. దాదాపు 16 ఏళ్లుగా ఈ కేసు సాగుతూనే ఉంది.

లొంగిపోయే ముందు రాజ్‌పాల్ యాదవ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. "సార్ ఏం చేయను? నా దగ్గర పైసా కూడా లేదు, నాకు వేరే దారి కనిపించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఎవరూ రారని, ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని అర్థమైందని వాపోయారు. అప్పు తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేసినా, వడ్డీలతో కలిపి ఆ మొత్తం దాదాపు 9 కోట్లకు చేరడంతో ఆయన తట్టుకోలేకపోయారు.

గత ఏడాది 75 లక్షల వరకు చెల్లించినా, మిగిలిన బకాయిల విషయంలో కోర్టు సీరియస్ అయ్యింది. పదేపదే గడువు కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 4వ తేదీన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆయన పిటిషన్‌ను తిరస్కరించారు. ఒక వారం టైమ్ ఇచ్చినా లాభం లేదని భావించి వెంటనే జైలుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో ఒకప్పుడు స్టార్ హోదా అనుభవించిన నటుడు ఇప్పుడు జైలు గోడల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News