నిర్మాత హ‌క్కులు కాల‌రాసే రైట్ ఎవ‌రికీ లేదు!!

Update: 2021-08-23 14:30 GMT
ఓటీటీ వ‌ర్సెస్ థియేట్రిక‌ల్ రిలీజ్ అంశం నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతోంది. నేచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్య‌లు ఇటీవ‌ల‌ ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తొలుత థియేట‌ర్ రిలీజ్ ని వెన‌కేసుకొచ్చిన నాని త‌ర్వాత ఓటీటీకి వెళ్ల‌డంలో త‌ప్పేముంది? అన్న‌ట్లు వ్యాఖ్యానించారు. దీంతో నాని వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. నాని తొలుత స్పందించిన తీరును ప‌క్క‌న‌బెట్టి త‌ర్వాత ఆయ‌న్ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించడం వేడెక్కించింది.

తాజాగా నాని వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధిస్తూ యాక్టివ్ ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఎగ్జిబిట‌ర్ల సంఘానికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. సినిమా ఎక్క‌డ రిలీజ్ చేసుకోవాల‌న్న‌ది నిర్మాత ఇష్టంపైన ఆధార‌ప‌డి ఉంటుంది. సినిమా కు డ‌బ్బులు పెట్టేది నిర్మాత‌. ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కూ అన్ని బాధ‌లు ప‌డేది నిర్మాత ఒక్క‌డే. సినిమాలో న‌టులు..టెక్నిషియ‌న్లు త‌మ‌పని తాము చూసుకుని ఇంటికొచ్చేస్తారు. కానీ నిర్మాత రిలీజ్ వ‌ర‌కూ ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటారో ఎవ‌రికైనా తెలుసా? అని ప్ర‌శ్నించారు. సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత న‌ష్ట‌పోతే ఈ రోజు మాట్లాడిన వారంతా ఆ న‌ష్టాల్ని భ‌రిస్తారా? సినిమా నిర్మాత త‌న సినిమాని ఎవ‌రికైనా అమ్ముకోవ‌చ్చు. అప్ప‌టి స‌మ‌స్య‌ని బ‌ట్టి నిర్మాత ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకోవ‌చ్చు. అది అత‌ని ఇష్టం. అందులో మ‌రొక‌రు వేలుపెట్ట‌డానికి లేదు.

శాటిలైట్ బిజినెస్ త‌ర్వాత ఎక్క‌డైనా సినిమా రిలీజ్ చేసుకోవ‌చ్చు. థియేట‌ర్ రిలీజ్ లో న‌ష్టం వ‌స్తుందంటే ఓటీటీకి వెళ్లిపోతారు. అది వాళ్ల ఇష్టం. ఆ నిర్ణ‌యాన్ని కాద‌నే అధికారం..హ‌క్కు ఎవ‌రికీ లేవు. నిర్మాతను ఫ‌లానా విధంగానే రిలీజ్ చేయాల‌ని శాశించ‌డం త‌ప్పు. ఏడాదిన్న‌ర క్రితం వ‌ర‌కూ సినిమా థియేట‌ర్లోనే రిలీజ్ అయింది అన్న విష‌యాన్ని విమ‌ర్శ‌కులు మ‌ర్చిపోతున్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు అనుకూలంగా లేవు కాబ‌ట్టి నిర్మాత ఓటీటీకి వెళ్తున్నార‌ని గిల్డ్ సభ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంత‌కుముందు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ప్ర‌తిపాదించిన విష‌యాన్ని గిల్డ్ స‌మ‌ర్థించింది.

సురేష్ బాబు మాటే నెగ్గుతోంది!

రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. అన్ని రంగాల కంటే సినిమా రంగం దీనివ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయింది. అందుకే ఓటీటీల‌కు వెళుతున్నారు. క్రైసిస్ కి భ‌య‌ప‌డి చాలామంది నిర్మాత‌లు త‌మ సినిమాల్ని ఓటీటీ రిలీజ్ ల‌కు అమ్మేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు త‌మ సినిమాల‌ను ఓటీటీల‌కే విక్ర‌యించడంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అలాగే థియేట‌ర్ య‌జ‌మానుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఇప్ప‌టికే ఓటీటీ రిలీజ్ కుద‌ర‌ద‌ని థియేట‌ర్ల‌లోనే సినిమాలు రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసినా వాటిని భేఖాత‌రు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అక్టోబ‌ర్ త‌ర్వాతే ఓటీటీల‌కు త‌మ సినిమాల‌ను విక్ర‌యించాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ కోరింది.

కానీ సురేష్ బాబు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేట‌ర్ల‌ను కలిగి ఉన్న డి.సురేష్ బాబు త‌న సినిమాల‌ను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయ‌డంపై ఒక సెక్ష‌న్ విమ‌ర్శించింది. వెంక‌టేష్ న‌టించిన‌ `నారప్ప` సినిమాను జులై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ నేప‌థ్యంలో డి.సురేష్ బాబు నిర్మాత‌ల త‌ర‌పున త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కోట్లు ఖ‌ర్చు చేసి సినిమా తీసే నిర్మాత ఎక్క‌డ రిలీజ్ చేయాల‌న్నా స‌ర్వ‌హ‌క్కుల‌ను క‌లిగి ఉన్నార‌ని త‌న సినిమాల్ని తాను ఏ ఫార్మాట్ లో అయినా రిలీజ్ చేసుకోగ‌ల‌న‌ని డి.సురేష్ బాబు అన్నారు. ఈ బిజినెస్ లో త‌ప్పు ఒప్పుల‌ను చూడ‌టం స‌రికాద‌ని అన్నారు. కరోనా సమయంలో థియేటర్స్ యాజమాన్యమే కాదు నిర్మాతలు కూడా చాలా నష్టపోయారని సురేష్ బాబు అన్నారు. మంచి ధ‌ర ప‌లికిన‌ప్పుడు పోటీ అన్న‌దే లేని ఓటీటీలో రిలీజ్ చేస్తే త‌ప్పేమీ కాద‌ని సురేష్ బాబు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఇప్పుడున్న క్రైసిస్ లో థియేట్రిక‌ల్ రిలీజ్ కంటే కాంపిటీష‌న్ లేని ఓటీటీ రిలీజ్ స‌రైన‌దేన‌ని అన్నారు.

నారప్ప ఓటీటీ రిలీజ్ త‌ర్వాతా సురేష్ బాబు కాంపౌండ్ నుంచి విరాట‌ప‌ర్వం ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే వెంకీ న‌టించిన దృశ్యం 2 కూడా ఓటీటీకే విక్ర‌యించార‌ని గుసగుస‌లు వినిపించాయి. కానీ వాటిపై సురేష్ బాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News