టాప్ స్టోరి: ట్విట‌ర్ స్పేస్ లో తిట్లు చీవాట్లు దేనికయా?

Update: 2021-08-17 11:30 GMT
సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత సినిమా ప్రచారం ఎంత సుల‌భం అయ్యిందో అభిమానుల మ‌ధ్య వైరం కూడా అంతే వేగంగా పుంజుకుంటోంది. ఆన్ లైన్ తిట్లు హ‌ద్దుమీరుతున్నాయి. ఇన్ స్టార్...ట్విట‌ర్..ఎఫ్ బీల వేదిక‌గా అభిమానులు ఒక‌రినొక‌రు దూషించ‌డం ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. ఈ త‌ర‌హా పోక‌డ‌ ఎక్కువ‌గా కోలీవుడ్...టాలీవుడ్ అభిమానుల మ‌ధ్య‌నే ఉంది. బాలీవుడ్ కంటే సౌత్ లో ఈ సంస్కృతి అంత‌కంత‌కు పెచ్చుమీరుతోంది.

హీరోల‌కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉండ‌డం ఓకే కానీ ఈ తిట్ల క‌ల్చ‌ర్ మ‌రీ అంత మంచిది కాద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా తెలుగు-త‌మిళ‌ భాష‌ల్లో ఈ త‌ర‌హా పిచ్చి అభిమానం ఉండ‌టం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎంతో ప్ర‌భావ‌వంత‌మైన ఈ వేదిక‌పై పొర‌పాటున ఊహించ‌ని కామెంట్ ప‌డినా అది ప్ర‌మాదంగా మారింది. ఏదైనా ఉద్దేశ పూర్వ‌కంగా పెట్టినా..కార‌ణం ఏదైనా మ‌రో హీరో అభిమాని వెంట‌నే రియాక్ట్ అవుతాడు. ఆ త‌ర్వాత అది సోష‌ల్ మీడియాలో అదోర‌క‌మైన గ్యాంగ్ వార్ మారుతుంది.

తాజాగా ట్విట‌ర్లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్ `ట్విట్ట‌ర్ స్పేస్` ఇప్పుడు ఈ త‌ర‌హా వార్ కి వేదిక‌గా నిలుస్తోంది. విజ్ఞాన వంతులంతా ఆ స్పేస్ ని మంచి విష‌యాల‌కు వాడుతుంటే కొంద‌రు హీరోల అభిమానుల మాత్రం ఒక‌రినొక‌రు దూషించుకోవ‌డం విరివిగా వాడుతున్నారు. హీరో పేరు చెప్పుకుని అభిమానులు వ్యక్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగి హీరోల పేరు చెడ‌గొడుతున్నాడు. ``మేం క‌లిసే ఉంటాం.. మీరే అన‌వ‌స‌రంగా కొట్టుకుంటారు.. మారండి..`` అంటూ హీరోలు ఎంత చెప్పినా విన‌రు. ఇప్ప‌టికీ అధునాత‌న ప్ర‌పంచంలో అదే జ‌రుగుతోంది. తాజాగా ఓ హీరోకి పెళ్ల‌యి చాలాకాలమైనా ఇంకా పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం ఏమిటి అంటూ ఓ నెటిజ‌న్ స్పేస్ లో అడిగాడు. దీంతో ఆ హీరో వ్య‌తిరేక వ‌ర్గ‌మంతా ఆ నెటిజ‌నుడికి మ‌ద్దుతుగా నిలిచారు. దీనికి వెంట‌నే ప్ర‌తి దాడి కూడా మొదలైంది.

ఇక్క‌డ అలాంటి కామెంట్ పెట్టిన వాళ్ల‌ని ముందుగా సైబ‌ర్ క్రైమ్ వాళ్లు అదుపులోకి తీసుకుని త‌మ స్టైల్లో విచారిస్తే అన్ని దారిలోకి వ‌స్తాయ‌ని ప‌లువురు అభిమానులు కోరుతున్నారు. ఇలాంటి వార్ ఒక‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- మ‌హేష్ అభిమానుల మ‌ధ్య మ‌ళ్లీ మొద‌లైంది. `భీమ్లానాయ‌క్` గ్లింప్స్ లో ప‌వ‌న్ `ఏయ్ డానీ బ‌య‌ట‌కు రా నా కొడ‌కా` అంటూ డైలాగ్ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ డైలాగ్ ని మ‌హేష్ అభిమానులు త‌ప్పు బ‌డుతూ త‌మ హీరోకి అన్వ‌యించుకుని ప‌వ‌న్ పై వ్య‌తిరేక కామెంట్లు పెట్టారు .దీంతో ప‌వ‌న్ అభిమానులు ప్ర‌తిదాడి మొద‌లు పెట్టారు. మ‌హేష్ న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట` కూడా సంక్రాంతి రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలోనే పోటీ నెల‌కొంటుంద‌న్న భావ‌న‌లోనే ఈ వార్ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

గోడ పోస్ట‌ర్ పై పిడ‌క‌లు కొట్టిన క‌ల్చ‌ర్ ని మ‌ర్చిపోలేం. ఆ త‌ర్వాత థియేట‌ర్ క్యూలైన్ లో టిక్కెట్ట కోసం కొట్టుకున్న వైనం గుర్తు చేసుకుంటే న‌వ్వొస్తుంది. ఇప్పుడు ఆన్ లైన్ యుగంలోనూ ఈ కొట్లాట ఆగ‌దా సోద‌రా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.





Tags:    

Similar News