సంక్రాంతికి అన్నపూర్ణ 'సోగ్గాళ్లు'.. అప్పుడే కర్చీఫ్ కూడా..
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు అసలైన పండుగ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.పెద్ద హీరోల సినిమాలు, ఫ్యామిలీ స్టోరీలకు కలిసొచ్చే సమయం ఇదే.;
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు అసలైన పండుగ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.పెద్ద హీరోల సినిమాలు, ఫ్యామిలీ స్టోరీలకు కలిసొచ్చే సమయం ఇదే. అయితే ప్రతి ఏడాది లాగానే 2027 సంక్రాంతికి కూడా భారీ చిత్రాల సందడి ఉండబోతోందనే ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అదే సమయంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
"వాసి వాడి తస్సాదియ్యా… వచ్చే 15వ జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా.. డేట్ మార్క్ చేసుకోండి" అంటూ ఎమోజీలతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ నింపుతోంది. ఆ ఒక్క లైన్ తోనే సంక్రాంతి రిలీజ్ ను అధికారికంగా అన్నపూర్ణ స్డూడియోస్ ప్రకటించినట్లే.
అంతేకాదు ఆ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ క్లూ కూడా బయటకు వచ్చింది. సోగ్గాళ్లు అంటే.. ముగ్గురు హీరోలు అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రానున్న మూవీ.. మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండొచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు.
గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలు 2016, 2022 సంక్రాంతి సీజన్లలోనే వచ్చి మంచి విజయాలు సాధించాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్, పండుగ వాతావరణం, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీతో రూపొందిన ఆ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే బ్రాండ్ ను కొనసాగిస్తూ మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలుస్తోంది.
అయితే సోగ్గాళ్లు అంటే ఎవరు? నాగార్జున, నాగచైతన్య మళ్లీ కలిసి వస్తారా? లేక కొత్త హీరోలు కూడా కనిపిస్తారా? తండ్రి, అన్నయ్యతో అఖిల్ కనిపిస్తారా? అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్లాన్ ఏంటోనని మాట్లాడుకుంటున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. దీంతో దాని కోసమే అంతా వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీలతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఆ సీజన్ గోల్డెన్ ఛాన్స్ గా అంతా భావిస్తారు. దీంతో ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేయడం ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ తమ ప్రాజెక్ట్ పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే సంక్రాంతికి ఇప్పటికే నుంచే పోటీ పెరుగుతుంది. మరి అన్నపూర్ణ సంస్థ ఏ మూవీని తీసుకురానుందో వేచి చూడాలి.