ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానికి అసలు కారణమదే!!

Update: 2020-09-27 14:30 GMT
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. బాలు మరణానికి కరోనా కారణం కాదు.. ఆయన కరోనా నుంచి కోలుకున్నా ఇతర కారణాలే బాలు మరణానికి కారణమయ్యాయని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్లు దీపక్‌ సుబ్రమణియన్‌ - సభానాయగం ఓ ప్రకటన విడుదల చేశారు.

మెదడులో రక్తస్రావం - శ్వాసకోశ సమస్యలతోనే ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఊబకాయం తగ్గించుకునేందుకు ఏడేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయించుకోవడం మినహా ఆయనకు మధుమేహం కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆహారపు నియమాలను కూడా చక్కగా పాటించేవారని తెలిపారు.

‘ఆగస్టు 3న జలుబు, జ్వరం రావడంతో మా ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసుకున్నప్పుడు స్వల్పంగా కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలని ఆయనకు సూచించాం. ఆగస్టు 5న ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంతో 9న అత్యవసర చికిత్స విభాగానికి తరలించాం’ అని చెప్పారు.

13న వెంటిలేటర్‌, మరుసటి రోజు ఎక్మో పరికరం అమర్చినట్లు డాక్టర్లు తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన వైద్య నిపుణుల సలహాలతో చికిత్స చేశామన్నారు. దీంతో ఆయన స్పృహలోకి వచ్చి అందరినీ గుర్తించగలిగారని, సెప్టెంబరు 5న వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారని పేర్కొన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకుని కోలుకుంటూ వచ్చారని, గత గురువారం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి ఆందోళనకరంగా మారిందన్నారు.

శరీరమంతా వైరస్‌ వ్యాప్తించి అవయవాలు దెబ్బతిన్నాయని - వెంటనే సీటీస్కాన్‌ తీసి పరీక్షించినప్పుడు మెదడులో రక్తస్రావం గుర్తించామన్నారు. అదే సమయంలో శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఫలితం లేకపోయిందని.. పరిస్థితి విషమించి మరణించారని వైద్యులు పేర్కొన్నారు.
Tags:    

Similar News