ఇప్పుడు పోటీ మామూలుగా లేదు

Update: 2021-11-29 01:34 GMT
తమన్ .. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ సినిమా విడుదలకి వెళుతున్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా తమన్ తన బాణీలు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో మణిశర్మ .. దేవిశ్రీ ప్రసాద్ .. తమన్ మధ్య గట్టి పోటీ నడిచింది.

ఇక ఇప్పుడు హిట్ సాంగ్స్ పరంగా .. సినిమాల సంఖ్య పరంగా తమన్ ముందంజలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన స్వరపరిచిన పాటల కారణంగా కొన్ని సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి.

తాజాగా ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "సంగీత దర్శకుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి .. వాటిని ఉపయోగించుకుంటున్నాను. చాలా మంది దర్శకులు నన్ను నమ్ముతున్నారు .. నాకు స్వేచ్ఛను ను ఇస్తున్నారు.

అందువల్లనే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. గతంలో తమకి ఫలానా టైపు ట్యూన్ కావాలని దర్శకులు ఫిక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్త ప్రయోగాలు చేయడానికి వాళ్లు సహకరిస్తున్నారు.

మణిశర్మ గారి దగ్గర శిష్యరికం చేసి, ఆయననే మించి పోయానని అంటున్నారు. అలా జరిగినందుకు ఒక గురువుగా ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆయన దగ్గర కీ బోర్డు ప్లే చేసే రోజు నుంచి కూడా ఆయన నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకునేవారు.

నేను చేసిన 'దూకుడు' సినిమాలోని అన్ని పాటలు ఆయనకి ఎంతో ఇష్టం. మహేశ్ బాబు గారు అంటే ఆయనకి చాలా అభిమానం. మహేశ్ బాబు అంటే ఇంకాస్త రూట్స్ మార్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అలా చేసిన 'నీ దూకుడు .. 'అనే సాంగ్ ఆయనకి చాలా బాగా నచ్చింది.

'దూకుడు' ముందువరకూ నా గురించి మణిశర్మగారు అంతగా ఆలోచించలేదు. ఆ సినిమా సమయంలో నన్ను బాగా మెచ్చుకుని ప్రోత్సహించారు. ఇప్పడు లిరిక్ రైటర్స్ మ్యూజిక్ డైరక్టర్స్ అవుతున్నారు .. సింగర్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతున్నారు. రోజు రోజుకీ మేము యూ ట్యూబ్ వెతుక్కోవలసి వస్తోంది.

సడన్ గా ఎవరు యూ ట్యూబ్ స్టార్ అయ్యారా అని. రెహమాన్ గారు .. దేవిశ్రీ ప్రసాద్ గారు .. మణిశర్మగారు ఉన్నప్పుడు అంత పోటీ ఉండేది కాదు. ఇప్పుడు చాలా కష్టమవుతోంది. కొత్తవాళ్ల నుంచి పోటీ ఎక్కువగా ఉంటోంది. అందువలన ఎక్కువగా పరిగెత్తవలసి వస్తోంది" అని చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News