ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం

Update: 2017-04-29 10:49 GMT
ఒకప్పుడు ప్రకాష్ రాజ్ అంటే వివాదాలే గుర్తుకొచ్చేవి. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే తమిళ నిర్మాతల మండలి ఎన్నికల సందర్భంగా చాలా చురుగ్గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్.. విశాల్ తో కలిసి తమిళ రైతుల కోసం ఆర్థిక మంత్రిని కలవడంపై ప్రశంసల జల్లు కురిసింది. ఐతే ఇలాంటి సమయంలో ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. అనవసరంగా తమిళనాడు రాజకీయాలపై స్పందించి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. తమిళనాడును తమిళులే పరిపాలించాలన్న నినాదాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాష్ రాజ్ బుక్కయ్యాడు.

తమిళ రాజకీయాల్లో అనేక మంది నాన్-తమిళియన్స్ ఉన్నారు. ఐతే ఈ మధ్య తమిళ్.. నాన్ తమిళ్ అనే చర్చ మొదలైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్న వారిని వ్యతిరేకిస్తూ.. మరాఠీ వాడైన రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ని అంగీకరించబోమంటూ కొన్ని తమిళ రాజకీయ పార్టీలు.. సంఘాలు పేర్కొన్నాయి. తమిళులే తమిళనాడును పాలించాలని తీర్మానించాయి. ఈ నినాదాన్ని ప్రకాష్ రాజ్ వ్యతిరేకించాడు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఎవరైనా పరిపాలన చేయొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో తమిళనాడు ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని.. ఇందుకు ప్రకాష్‌ రాజ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. తాజాగా తమిళర్‌ మున్నేట్రపడై అనే పార్టీ నాయకులు.. కార్యకర్తలు చెన్నైలోని ప్రకాష్ రాజ్ ఇంటినే ముట్టడించారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రకాష్ రాజ్ ఇంటిపై దాడికి దిగే సమయానికి పోలీసులు అక్కడికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆందోళనకారులను చెదరగొట్టి.. కొందరు నాయకుల్ని అరెస్టు చేశారు. ఈ దాడిపై ప్రకాష్ రాజ్ ఇంకా ఏమీ స్పందించలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News